China: చైనాలో కఠినంగా జీరో కోవిడ్ పాలసీ.. నిరసనల్లో మారుమోగుతున్న బప్పిలహరి సాంగ్
China Lockdown: కరోనాను కట్టడి చేసేందుకు ఏ దేశమైనా ఏం చేస్తోంది? అవసరమైన ప్రజలకు చికిత్సనందిస్తుంది.
China Lockdown: కరోనాను కట్టడి చేసేందుకు ఏ దేశమైనా ఏం చేస్తోంది? అవసరమైన ప్రజలకు చికిత్సనందిస్తుంది. వ్యాధిని కట్టడి చేసేందుకు లాక్‌డౌన్ విధిస్తుంది. వైరస్ ప్రభావం తక్కువ ఉన్న వారికి.. మందులను అందించి.. సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉండమని చెబుతుంది. ప్రపంచమంతటా ఇదే జరిగింది. కానీ చైనా మాత్రం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తోంది. వైరస్‌ను కట్టడి చేయడానికి సైన్యాన్ని రంగంలోకి దింపుతుంది. వైరస్ లేదని నెగిటివ్ సర్టిఫికేట్ ఇచ్చినా గన్నులు పెట్టి బెదిరించి మరీ క్వారంటైన్‌కు తరలిస్తుంది. అంతేకాదు వైరస్ సోకిన వ్యక్తి ఏ పార్కులోనో, ఫ్యాక్టరీలోనూ ఉంటే వారి పని గోవిందా అధికారులు లాక్‌డౌన్ ఎత్తేసేవరకు లేదా అందరికీ నెగిటివ్ అని తేలేవరకు వారు అక్కడే మగ్గాల్సిందే. తాజాగా షాంఘైలోని డిస్నీ రిసార్ట్‌లో ఎవరికో వైరస్ సోకిందని తెలిసి లోపలున్న వందలాది మందిని బయటకు రాకుండా అధికారులు నిర్బంధించారు.
2020 మార్చి తరువాత కరోనా విజృంభించడంతో ఎన్నో దారుణ సంఘటనలను మనం చూశాం. ఉన్నట్టుండి లాక్‌డౌన్ ప్రకటించడంతో వేలాది మంది పట్టణాల నుంచి వందలాది కిలోమీటర్ల దూరంలోని స్వగ్రామాలకు కాలినడకన వెళ్లారు. ఆ తరువాత వైరస్ ధాటికి బయపడి.. భయపడి ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావడానికి కూడా జంకారు. కాలనీలో ఎవరికైనా వైరస్ వచ్చిందని తెలిస్తే అటువైపు రావడానికి కూడా వణికిపోయేవారు. 2021 చివరి నాటికి కోవిడ్ టీకాలు అందుబాటులోకి రావడంతో పరిస్థితులు క్రమంగా చక్కబడ్డాయి. ఇప్పుడు కరోనా వచ్చిందంటే ఎవరూ భయడడం లేదు. వైరస్ సోకిన వారు కేవలం జాగ్రత్తలు తీసుకుని దాని నుంచి బయటపడుతున్నారు. కానీ చైనాలో మాత్రం రెండున్నరేళ్లయినా ఆ పరిస్థితి కనిపించడం లేదు. పైగా కోవిడ్ ఆంక్షలు మరింత తీవ్రమయ్యాయి. వైరస్ సోకిన వారు, షాపింగ్ మాల్, పార్క్, ఫ్యాక్టరీ ఎక్కడున్నా వారితో పాటు మిగిలిన వారిని కూడా నిర్బందిస్తున్నారు. అందరికీ నెగటివ్ వచ్చే వరకు అలాగే మగ్గిపోతున్నారు. రోజుల తరబడి బయటకు వదలకపోవడంతో అధికారుల కళ్లుగప్పి ప్రహరీలను దూకి పారిపోతున్నారు. ఇప్పుడు ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి.
తాజాగా షాంఘైలోని డిష్నీ రిసార్ట్‌లో 12 మందికి వైరస్ సోకినట్టు గుర్తించారు. విషయం తెలిసిన అధికారులు ఎలాంటి ప్రకటనా లేకుండా రిసార్ట్‌ను మూసేశారు. లోపలున్న వారిని లోపలే పెట్టి బయటి నుంచి ఎవరినీ అనుమతించలేదు. అందులో ఉన్న వేలాది మందికి రోజుకు మూడు సార్లు చెప్పున టెస్టులు నిర్వహిస్తారు. ఎవరికీ వైరస్ లేదని తెలిసిన తరువాతే బయటకు వదులుతామని అధికారులు స్పష్టం చేశారు. దీంతో లోపల ఉన్నవారు భయాందోళనకు గురవుతున్నారు. వారిని అలా ఎన్నాళ్లు నిర్బంధిస్తారో తెలియదు. అందుకే వారంతా ఆందోళనకు గురవుతున్నారు. నాలుగు చదరపు కిలోమీటర్ల విస్తీరణంలో ఉండే ఈ రిసార్ట్‌లోకి వేలాది మందిని అనుమతిస్తారు. తాజాగా వారంతా లోపలే ఉండిపోయారు. మూడ్రోజుల పాటు లోపలే ఉండాలని షాంఘై అధికారులు చెబుతున్నప్పటికీ అలాంటి పరిస్థితి కనిపించడం లేదంటూ పార్క్‌లో ఉన్న ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వైరస్ విషయం తెలుసుకున్న ప్రజులు పలువురు గేట్ల వద్దకు వెళ్లినప్పటికీ అప్పటికే మూసేసినట్టు తెలిసి ఆవేదన వ్యక్తం చేశారు. అయితే షాంఘైలోని ఈ డిస్నీ పార్క్‌ను ఇలా అకస్మాత్తుగా మూసేయడం ఇదే తొలిసారి కాదు. సరిగ్గా గతేడాది నవంబరులోనూ ఇలాగే మూసేశారు. అప్పట్లో ఈ రిసార్ట్‌లోపల ఉన్న 30వేల మందిని అలాగే నిర్బంధించారు. అయితే ఇప్పటికే రిసార్ట్ టికెట్లను కొనుగోలు చేసిన వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిర్వాహకులు మాత్రం తీసుకున్న టికెట్లు ఆరునెలల వరకు వర్తిస్తాయని చెబుతున్నారు.
ఇలాగే కేసు నమోదయ్యిందని జెంగ్‌జౌలో యాపిల్ యూనిట్‌లోని వేలాది మంది కార్మికులను చైనా అధికారులు నిర్బంధించారు. జెంగ్‌జౌలో లాక్‌డౌన్ విధించడంతో ఫాక్స్‌కాన్‌లో పనిచేస్తున్న ఉద్యోగులు, కార్మికులు చైనా అధికారుల కళ్లుగప్పి కంచెను దాటుకుని వస్తున్న దృశ్యాలు తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఫాక్స్‌కాన్‌లో ఉన్న కార్మికులు నెలలకొద్ది బయటి వాతావరణంలోకి రాలేదు. దీంతో మానసికంగా కృంగిపోతున్నట్లు కూడా నివేదికలు చెప్తున్నాయి. ఈ కారణంగా ఫ్యాక్టరీ నుంచి బయటపడేందుకు ఉద్యోగులు యత్నిస్తున్నారు. బస్సుల్లోనూ, ట్రైన్‌లోనూ వెళ్తే.. కొవిడ్ యాప్ కంట పడుతామని భావించి వందలాది కిలోమీటర్ల దూరంలోని తమ సొంతూళ్లకు కాలినడకన వెళ్తున్నారు. అంతేకాదు ఈ యూనిట్లో వైరస్ వ్యాప్తి తీవ్రంగా ఉండటంతో చాలా మంది ఉద్యోగులను క్వారంటైన్‌లో ఉంచి చికిత్స అందించారు. ఎక్కువ కాలం పాటు క్వారంటైన్‌లో ఉండడంతోనే మానసికంగా ఉద్యోగులు కృంగిపోయినట్లుగా తెలుస్తోంది. ఈ యూనిట్‌లో 3 లక్షల మందికి పైగా కార్మికులు పని చేస్తున్నారు. మరోవైపు కరోనా పుట్టినిల్లు వూహాన్‌లో వైరస్ కట్టడికి ఆర్మీని రంగంలోకి దింపింది. కరోనా సోకిన వ్యక్తులను గుర్తించి క్వారంటైన్‌కు తరలించడంలో ఆర్మీ కీలకపాత్ర పోసిస్తోంది.
ఇదిలా ఉంటే.. అలనాటి బాలీవుడ్ సినిమా డిస్కో డాన్సర్‌లోని పాట జిమ్మీ జిమ్మీ ఆజా ఆజా తాజాగా చైనాలో మార్మోగుతోంది. కఠిన లాక్‌డౌన్ ఆంక్షలను విధిస్తున్న ప్రభుత్వ తీరుపై చైనీయులు నిరసనలు చేపడుతున్నారు. ఆ నిరసనల్లో జిమ్మీ జిమ్మీ సాంగ్ ప్రతిధ్వనిస్తోంది. జీరో కోవిడ్ విధానాన్ని వ్యతిరేకిస్తూ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బప్పిలహరి స్వరపరిచిన ఆ నాటి సాంగ్ ఇప్పుడు చైనాలో ఆందోళనలకు వాడుతున్నారు. డౌయిన్ అనే సోషల్ మీడియా యాప్‌లో జిమ్మీ జిమ్మీ సాంగ్‌తో నిరసనకారులు వీడియోలు పోస్టు చేస్తున్నారు. కానీ మాండరిన్ భాషలో జిమ్మీ జిమ్మీ సాంగ్ సాగుతుంది. ఆ భాషలో జీ మీ.. జీ మీ అన్నట్లుగా పాటు ఉంటుంది. భోజనం పెట్టండి అని మాండరిన్‌లో దాని అర్థం. కఠిన లాక్‌డౌన్ వల్ల నిత్యావసర ఆహార పదార్ధాలు దొరకడం లేదని చైనీయులు పాట రూపంలో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి చైనాలో సోషల్ మీడియాపై విపరీతమైన ఆంక్షలు ఉంటాయి. కానీ వైరల్‌గా మారుతున్న జిమ్మీ జిమ్మీ సాంగ్‌ను మాత్రం చైనా కట్టడి చేయలేకపోతోంది. లాక్‌డౌన్‌ను వ్యతిరేకిస్తూ ఆందోళనలు చేస్తున్నవారిపై పోలీసులు లాఠీఛార్జ్ చేస్తున్నారు. ఆ ఘటనలకు చెందిన వీడియోలు చైనాలో వైరల్ అవుతున్నాయి.
వైరస్‌ను గుర్తించిన నాటి నుంచి చైనా జీరో కోవిడ్ విధానాన్ని అమలు చేస్తోంది. ఒక్క కేసు నమోదైనా ఆ ప్రాంతానికి చెందిన ప్రజలను క్వారంటైన్‌కు బలవంతంగా తరలిస్తున్నారు. ఆ ప్రాంతాన్ని వెంటనే మూసేస్తారు. ఇలా వరుస లాక్‌డౌన్లతో రెండేళ్ల నుంచి చైనీయులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. లాక్‌డౌన్ల కారణంగా పరిశ్రమలు మూతపడుతున్నాయి. దీంతో ఉపాధి లేక తినడానికి తిండి కూడా లభించక అల్లాడిపోతున్నారు. మరోవైపు క్వారంటైన్ కేంద్రాలు జైళ్ల కంటే దారుణంగా ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో క్వారంటైన్‌కు వెళ్లేందుకు చైనీయులు జంకుతున్నారు. దానికన్నా వైరస్‌తో చనిపోవడమే మేలని వాపోతున్నారు. జీరో కోవిడ్‌పై ప్రపంచ వ్యాప్తంగా విమర్శలు వస్తున్నా చైనా ప్రభుత్వం మాత్రం వెనక్కి తగ్గడం లేదు. అదే సరైన విధానమంటూ సమర్థించుకుంటోంది. జీరో కోవిడ్ విధానంతో చైనా మానవ హక్కుల ఉల్లంఘనలకు పాల్పడుతోందంటూ పలు దేశాలు విమర్శిస్తున్నాయి.