వ్యాక్సిన్ తయారీలో ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ ముందడుగు.. త్వరలో అందుబాటులోకి కరోనా మందు..
కరోనా మహమ్మారి రోజురోజుకూ కోరలు చాస్తుంది. కంటికి కనిపించని ఈ వైరస్ చాపకింది నీరులా విస్తరిస్తుండటంతో ప్రజలు భయంతో వణికిపోతున్నారు. ఎక్కడికి వెళ్లాలన్నా, ఎవరితో మాట్లాడాలన్నా మహమ్మారి ఎటునుంచి వచ్చి అంటుకుంటుందో అని అనుమానంతో ఆపసోపాలు పడుతున్నారు. ఈ భయంకరమైన COVID-19 కు వ్యాక్సిన్‌ను కనుగొనటానికి ప్రపంచం మొత్తం రేసులో నిలిచింది. అయితే సెప్టెంబర్ చివరిలో మార్కెట్లోకి కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
కరోనా విశ్వమారిని కట్టడి చేసేందుకు వ్యాక్సిన్ అభివృద్ధిలో పలు దేశాలు, సంస్థలు నిమగ్నమయ్యాయి. వ్యాక్సిన్ సత్ఫలితాల్ని ఇస్తే సరఫరా ఆలస్యం కాకూడవన్న ఉద్దేశంతో ఇప్పటికే పలు దేశాలు వ్యాక్సిన్ ఉత్పత్తిని కూడా ప్రారంభించాయి. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 120 వ్యాక్సిన్‌లు అభివృద్ధి దశలో ఉన్నాయి. వీటిలో పది వ్యాక్సిన్‌లు క్లినికల్ ట్రయల్స్ దశకు చేరుకున్నాయి.
ప్రస్తుతం జరుగుతోన్న ఫలితాలు అనుకున్నట్టు జరిగితే సెప్టెంబర్‌లో కోవిడ్-19 వ్యాక్సిన్ అందుబాటులోకి రానున్నట్లు బ్రిటన్ ఫార్మా దిగ్గజ సంస్థ ఆస్ట్రాజెనెకా స్పష్టం చేసింది. ఆక్సఫర్డ్ యూనివర్సీటికి చెందిన శాస్త్రవేతలు సహచరులతో కలిసి వ్యాక్సిన్ తయారుచేయడానికి అహర్నిశలు శ్రమిస్తున్నారు. రాబోయే పక్షం రోజుల్లో ఈ వ్యాక్సిన్‌ను హ్యూమన్స్ పై టెస్టు చేయబోతున్నారు. ఏజెడ్‌డీ 1222 జేఏబీ అనే వ్యాక్సిన్ తయారీని ప్రారంభించామని అన్ని పరీక్షలు ఆగస్టులో విజయవంతంగా పూర్తయ్యే నాటికి మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు వ్యాక్సిన్ సిద్ధంగా ఉంటుందని ఆ సంస్థ ప్రకటించింది.
ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ అభివృద్ధి చేస్తున్న ఈ వ్యాక్సిన్ 18–55 ఏళ్ల మధ్య ఉన్న ఆరోగ్యకరమైన వాలంటీర్లపై ప్రయోగాలు నిర్వహించింది. దీంతో తొలిదశ ట్రయల్స్ విజయవంతం అయినట్టు ప్రకటించడంతో ప్రజలలో ఆశలు చిగురించాయి. అయితే ప్రస్తుతం మరో దశ ప్రయోగం చేయాల్సి ఉంది. అది కూడా త్వరలోనే నిర్వహించేందుకు సదరు సంస్థ సిద్ధమైంది. ఇందుకు గాను 10,260 మంది వాలంటీర్లను ఎంపిక చేసింది. వారిపై ప్రయోగాలు ఆగస్టు నాటికి సత్ఫలితాలనిస్తే తమ కృషి ఫలించినట్టేనని, వెంటనే వ్యాక్సిన్‌ను మార్కెట్‌లో విడుదల చేసే అవకాశం ఉందని అంచనా వేస్తోంది. ఇదిలావుంటే ఆస్ట్రాజెనెకా ఫార్మా సంస్థ నాలుగు దేశాల్లో ఆక్స్‌ఫర్డ్ వ్యాక్సిన్‌ను ఉత్పత్తి చేయనుంది.
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ నిర్మూలించే వ్యాక్సీన్ ఇప్పట్లో మార్కెట్లోకి రాదని.. రెండేళ్లు లేదా కనీసం 18 నెలల సమయం పడుతుందని చాలామంది సైంటిస్టులు అంచనా వేస్తున్నారు. కానీ కరోనా వ్యాక్సీన్ 2020లో సెప్టెంబర్ నెలాఖరులో మార్కెట్లోకి అందుబాటులో ఉండొచ్చునని పలు సంస్థలు ప్రకటిస్తున్నాయి. ఇప్పటికే కరోనాకు వ్యాక్సిన్ తయారు చేసేందుకు ప్రపంచవ్యాప్తంగా అనేక ఫార్మా సంస్థలు పనిచేస్తున్నాయి. అందులో 12 సంస్థల పరిశోధనలను WHO గుర్తించింది . అలా గుర్తించిన వాటిలో ఆక్సఫర్డ్ యూనివర్సీటి ఒకటికావడంతో ఆశలు చిగురిస్తున్నాయి.
ఆస్ట్రాజెనెకా ఫార్మా సంస్థ నాలుగు దేశాల్లో ఆక్స్‌ఫర్డ్ వ్యాక్సిన్‌ను ఉత్పత్తి చేయనుంది. బ్రిటన్ తోపాటు భారత్, నార్వే, స్విట్జర్లాండ్ దేశాల్లో వ్యాక్సిన్ తయారీని ప్రారంభించనుంది. అయితే భారత్ లో ఈ వ్యాక్సిన్ తయారు చేసేందుకు సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియాతో ఇప్పటికే ఒప్పందం కుదిరింది.ఆస్ట్రాజెనెకా అంచనా ప్రకారం 2020 సెప్టెంబర్ నెలాఖరులో మార్కెట్లోకి అందుబాటులో ఉండొచ్చుని అంచనా. 2021 జూన్ నాటికి 200 కోట్ల డోసుల ఏజెడ్‌డీ 1222 జేఏబీ వ్యాక్సిన్ రెడీ కానున్నట్లు తెలుస్తోంది.