Joe Biden: ఆఫ్ఘన్ నుంచి తరలింపు చర్యలపై బైడెన్ కీలక నిర్ణయం
Joe Biden: * తరలింపు ప్రక్రియ 31 వరకు ముగించాల్సిదేనన్న బైడెన్ * తాలిబన్లతో అమెరికా రహస్య మంతనాలు
Joe Biden: ఆఫ్ఘనిస్తాన్ నుంచి తమ బలగాలు, పౌరులు, శరణార్థుల తరలింపు తుది గడువుపై నెలకొన్న ఉత్కంఠకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తెరదించారు. ముందుగా నిర్దేశించుకున్నట్లే ఈ నెల 31 కల్లా తమవారందర్నీ తీసుకెళ్లాలని నిర్ణయించారు. గడువు పొడిగించేందుకు నిరాకరించారు. 31 కల్లా తరలింపు చర్యలు పూర్తవడం కష్టమని.. మరికొన్నాళ్లపాటు గడువు పొడిగించాలని బ్రిటన్ సహా పలు దేశాలు బైడెన్‌ను కొన్నిరోజులుగా ఒత్తిడి చేస్తున్నాయి. దీంతో గడువు పొడిగింపు అవకాశాలను కొట్టిపారేయలేనని తెలిపారు. ఈ వ్యవహారంపై జాతీయ భద్రత బృందంతో బైడెన్ చర్చలు జరిపారు. ఈ నెల 31 తర్వాత కూడా అఫ్గాన్‌లో తమ బలగాలను ఉంచితే ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యే అవకాశాలున్నాయో తెలుసుకున్నారు. గడువు పొడిగింపునకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకున్నారు.
అంతకుముందు, తరలింపు చర్యల గడువు విషయంలో అఫ్గాన్‌లో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. కాబూల్‌లో తాలిబన్ రాజకీయ విభాగం అగ్రనేత అబ్దుల్ ఘనీ బరాదర్‌తో అమెరికా నిఘా సంస్థ- సీఐఏ డైరెక్టర్ రహస్యంగా భేటీ అయ్యారు. సమావేశంలో ఏం చర్చించారన్నది అధికారికంగా తెలియలేదు. తరలింపులకు సమయాన్ని పొడిగించే ప్రసక్తే లేదని తాలిబన్ అధికార ప్రతినిధి జబిహుల్లా ముజాహిద్ మరోసారి స్పష్టం చేశారు. మరోవైపు- ప్రస్తుతం కాబుల్ విమానాశ్రయం వద్ద తమ సైనికులు 5వేల, 800 మంది విధులు నిర్వర్తిస్తున్నారని అమెరికా జాతీయ భద్రత సలహాదారు తెలిపారు. ఈ నెల 31లోగా వీలైనంత ఎక్కువ మందిని అఫ్గాన్ నుంచి బయటకు తీసుకురావడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు.
తాలిబన్ల దురాక్రమణతో ఆఫ్గాన్‌లో తలెత్తిన సంక్షోభం, తాజా పరిస్థితులపై ప్రధాని మోడీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌లు చర్చలు జరిపారు. దాదాపు 45 నిమిషాల పాటు ఫోన్‌లో మాట్లాడుకున్నారు. ఉగ్రవాద భావజాలాన్ని, అఫ్గాన్ నుంచి ఎదురయ్యే మాదక ద్రవ్యాల సవాళ్లను ఎదుర్కోవడంలో పరస్పరం సహకరించుకోవాలని నేతలిద్దరూ ఓ అవగాహనకు వచ్చినట్లు సమాచారం.