రష్యాపై అమెరికా మరిన్ని ఆంక్షలు
Joe Biden: *4 బ్యాంకుల లావాదేవీలపై నిషేధం *టెక్నాలజీ పరంగా రష్యాను దెబ్బతీస్తాం
Joe Biden: ఉక్రెయిన్‌పై రష్యా దాడి నేపథ్యంలో ప్రపంచదేశాలు రష్యాపై కఠిన ఆంక్షలు విధిస్తోంది. ఇందులో భాగంగా రష్యాపై మరిన్ని కఠిన ఆంక్షలు విధించినట్లు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తెలిపారు. పుతిన్ అన్యాయమైన దాడికి పాల్పడినందుకు ప్రతిగా మిత్ర దేశాలతో కలిసి రష్యాపై తీవ్ర ఆంక్షలు విధిస్తున్నట్టు ప్రకటించారు. రష్యాకు వ్యతిరేకంగా ప్రపంచం ఏకమైందని, పుతిన్ ప్రాణాంతకమైన, మానవాళికి తీరని బాధను మిగిల్చే యుద్ధాన్ని ఎంచుకున్నారని మండిపడ్డారు. ఈ దాడుల ఫలితంగా చోటుచేసుకునే మరణాలకూ, విధ్వంసానికి రష్యాదే బాధ్యత అని తేల్చిచెప్పారు.
రష్యా నుంచి సైబర్ దాడులు జరిగితే, వాటిని దీటుగా తిప్పికొట్టేందుకు సిద్ధమయ్యామన్నారు. నాటో మిత్రదేశాలకు మరిన్ని ట్రూపుల సైన్యాన్ని పంపుతున్నామని అయితే ఉక్రెయిన్‌కు అమెరికా దళాలను పంపుతారన్న వార్తలను జో బైడెన్ ఖండించారు. ఇక అమెరికా, మిత్రదేశాలు కలిసి రష్యాకు చెందిన నాలుగు పెద్ద బ్యాంకులను స్తంభింపజేస్తాయి. ఆ దేశ ప్రముఖులకు సంబంధించిన ఎగుమతులపైనా, హైటెక్ రంగాలకు చెందిన పరిశ్రమలపైనా ఆంక్షలు విధించామని బైడెన్ తెలిపారు.ప్రపంచ వ్యాప్తంగా బ్యాంకు నుంచి బ్యాంకుకు, రష్యా ఇంధన రంగానికి చెల్లింపులు జరిపేందుకు ఉపయోగపడే స్విఫ్ట్ చెల్లింపు వ్యవస్థ నుంచి రష్యాను తొలగిస్తామన్నారు.