China: డ్రాగన్ కంట్రీలో మరో కొత్త ఉద్యమం
*సోషల్ మీడియా ట్రెండింగ్‌లో 996 ప్రొటెస్ట్ *996 కల్చర్‌కు వ్యతిరేకంగా ఆన్‌లైన్ ఉద్యమం
China: గ్లోబల్ టెక్ లో కొత్త ఉద్యమాలు పుట్టుకొస్తున్నాయి. ఇప్పటికే అమెరికా సహా పలు దేశాల్లో 'ది గ్రేట్ రిజిగ్నేషన్' సంక్షోభం కంటిన్యూ అవుతున్న వేళ చైనాలో మరో కొత్త ప్రొటెస్ట్ మొదలైంది. డ్రాగన్ కంట్రీలోని టెక్ ఉద్యోగులంతా 996 కల్చర్‌కు వ్యతిరేకంగా ఆన్‌లైన్ ఉద్యమానికి తెరలేపారు. ఓవర్‌టైం పనివేళలు, వీక్ ఆఫ్స్ విషయంలో అసంతృప్తి వ్యక్తం చేస్తూ వారు పని చేస్తోన్న కంపెనీలో పనివేళల వివరాలను ఆన్‌లైన్‌లో పొందుపరుస్తున్నారు. ఇలా ఒక డేటాబేస్‌ను ఏర్పాటు చేశారు. ఇప్పటికే వేల సంఖ్యలో ఉద్యోగులు వారి వివరాలు నమోదు చేయగా అందులో అలీ బాబా గ్రూప్, బైడూ, టెన్సెంట్ హోల్డింగ్స్, బైట్ డాన్స్ వంటి చైనాలోని ప్రముఖ సంస్థల ఉద్యోగులు సైతం ఉండటంతో ఈ నయా ఉద్యమం ఒక్కసారిగా ట్రెండింగ్‌లోకి వచ్చింది.
తాజాగా చైనా 996 ఆన్‌లైన్ ఉద్యమంపై ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి మొదలైంది. దీనిపై పెద్ద ఎత్తున ఇంటర్‌నెట్‌లో సెర్చ్ చేస్తున్నారు. అయితే, 996 సంఖ్య పనివేళలు, రోజులను సూచిస్తోంది. ఉద్యోగులు ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు వారానికి 6 రోజులు విధులు నిర్వర్తిస్తున్నారు. దీన్నే 996గా పేర్కొంటున్నారు. చైనాలో ఉద్యోగులకు పనివేళలు, పనిభారం కూడా ఎక్కువే. కంపెనీ నిబంధనలో ఉద్యోగుల విధులు వారంలో ఐదు రోజులు, రోజుకు 8 గంటలు ఉంటాయని పేర్కొన్నా చాలా కంపెనీల్లో ఉద్యోగులు వారానికి ఆరు రోజులు రోజుకు 10 నుంచి 12 గంటలు పనిచేస్తున్నట్లు డేటాబేస్‌లో నమోదవుతుండడంతోనే ఈ ఉద్యమానికి తెరలేపినట్లు తెలుస్తోంది.
ఇదే సమయంలో చైనాలో పనివేళల విషయంపై గత కొంతకాలంగా ఆందోళనలు వ్యక్తమవుతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే బాయ్‌కాట్ 996 ఉద్యమాన్ని మొదలు పెట్టారు అక్కడి టెకీలు. ఇందులో పాల్గొంటున్న వారంతా 996 కల్చర్‌ను నిషేధించి ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పని వేళలు వారానికి ఐదు రోజులే పనిదినాలని తీసుకురావాలని కోరుతున్నారు. ఈ ఉద్యమం ద్వారా అయినా కంపెనీలు ఈ విషయంపై దృష్టి సారిస్తాయని ఆశిస్తున్నారు. అలాగే చదువు పూర్తి చేసుకొని ఉద్యోగంలో చేరాలనుకునే వారికి ఏయే కంపెనీలో పని వేళలు ఎలా ఉన్నాయో తెలుసుకునేందుకు ఈ డేటాబేస్ ఉపయుక్తంగా ఉంటుందని డ్రాగన్ కంట్రీ టెకీలు చెబుతున్నారు.