Alexei Navalny: రష్యా ప్రతిపక్షనేత అలెక్సీ నావల్నీ జైలులో మృతి
Alexei Navalny: రష్యాలో అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తున్నవేళ సంచలన ఘటన చోటుచేసుకుంది.
Alexei Navalny: రష్యాలో అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తున్నవేళ సంచలన ఘటన చోటుచేసుకుంది. దేశాధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు బద్ధశత్రువుగా పేరున్న విపక్ష అగ్రనేత అలెక్సీ నావల్నీ మృతి చెందారు. తీవ్రవాదం సంబంధిత అభియోగాలపై 19 ఏళ్ల కారాగార శిక్ష ఖరారవడంతో ఖార్ప్ పట్టణంలోని జైలులో ఉన్న నావల్నీ.. అస్వస్థతకు గురై వెంటనే స్పృహ కోల్పోయారు. అంబులెన్సులో వైద్య సిబ్బంది వచ్చి ఆయన్ను కాపాడేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయిందని ఖార్స్ జైళ‌్ల శాఖ అధికారి వెల్లడించారు.
మరణానికి కారణాలేంటో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నామని పేర్కొన్నారు. నావల్నీ రెండు రోజుల క్రితం వీడియో లింక్ ద్వారా కోర్టుకు హాజరయ్యారు. ఆ సమయంలో జడ్జితో నవ్వుతూ మాట్లాడిన చిత్రాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. నావల్నీ మృతిపై పశ్చిమ దేశాల నేతలు, రష్యా విపక్ష నాయకులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆయన్ను పుతినే చంపించారని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఆరోపించారు.
2020లో విషప్రయోగానికి గురైన ఆయన.. జర్మనీలో దీర్ఘకాలం చికిత్స తీసుకొని కోలుకున్నారు. ఆ విషప్రయోగం వెనుక పుతిన్ హస్తముందని అప్పట్లో ఆరోపణలు వెల్లువెత్తాయి. వచ్చే నెలలో రష్యా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే నావల్నీని పుతిన్ చంపించారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.