Coronavirus: ప్రపంచ దేశాల్లో మళ్లీ మొదలైన కోవిడ్ కల్లోలం
Coronavirus: ఇప్పటికే లాక్‌డౌన్ అమలు చేస్తున్న ఆస్ట్రియా
Coronavirus: ప్రపంచ దేశాల్లో మరోసారి కోవిడ్ కల్లోలం ప్రారంభమైంది. దీంతో ఆస్ట్రియా సహా పలు దేశాలు లాక్‌డౌన్ వైపు అడుగులు వేస్తుండగా ఐరోపా సహా కొన్ని దేశాల్లో లాక్‌డౌన్‌కు వ్యతిరేకంగా ఆందోళనలు ఉధృతం అవుతున్నాయి. ఆస్ట్రియా రాజధాని వియన్నాలో లాక్‌డౌన్‌కు వ్యతిరేకంగా దాదాపు 35వేల మంది రోడ్డెక్కారు. వీరిని అదుపు చేసేందుకు 13వందల మంది పోలీసులు రంగంలోకి దిగారు. ఇదే సమయంలో ఆందోళనకారుల్లో చాలామంది కనీసం మాస్కులు కూడా ధరించలేదు. ఆస్ట్రియాతో పాటు స్విట్జర్లాండ్, క్రొయేషియా, ఇటలీల్లోనూ ఇదే తరహా ఉద్యమాలు ఊపందుకున్నాయి.
మరోవైపు నెదర్లాండ్స్‌లో ఆందోళనలు ఉద్రిక్తతలకు దారి తీశాయి. రోటర్‌డ్యామ్‌లో ఆందోళనలు ఉధృతం అవ్వడంతో నిరసన కారులపై పోలీసులు కాల్పులు జరిపారు. ఈ ఘటనల్లో ఏడుగురు గాయపడ్డారు. పలు ఐరోపా దేశాల్లోనూ ఇదే తరహా ఆందోళనలు టెన్షన్ పెడుతున్నాయి. గ్రీస్‌లో వ్యాక్సిన్ తీసుకోని వారిని మాల్స్‌లోకి రానీయకుండా నో ఎంట్రీ బోర్డులు పెట్టారు. దీనిపైనా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి
ఇదిలా ఉంటే కోవిడ్ కట్టడికి ఆస్ట్రేలియా రూపొందించిన చట్టంపై వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ప్రజారోగ్య నిర్వహణలో ఆరోగ్య మంత్రికి పూర్తి అధికారాలు ఇవ్వడం, వ్యాధిని మహమ్మారిగా ప్రకటించే అధికారం ప్రధానమంత్రికి ఇవ్వడంపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. దీన్ని వ్యతిరేకిస్తూ మెల్‌బోర్న్‌లోని పార్లమెంట్ హౌజ్ దగ్గర వేల మంది నిరసనలు చేపట్టారు. అయితే, మహమ్మారిని ఎదుర్కొనేందుకు ఈ చట్టం ఉపయోగపడుతుందని ప్రభుత్వం వాదిస్తోంది.
ఇదంతా ఒకెత్తయితే అమెరికా బూస్టర్‌డోస్ ప్రారంభించింది. వింటర్ సీజన్ నేపధ్యంలో కేసులు పెరగకుండా చర్యలు చేపట్టింది. 50 ఏళ్లు పైబడిన వారు తప్పకుండా బూస్టర్‌డోస్‌లు తీసుకోవాలని సూచించింది. అలాగే, 18 ఏళ్లు పైబడిన వారంతా ఫైజర్, లేదా మోడెర్నా టీకాకు సంబంధించి. చివరి డోస్ వేయించుకున్న 6 నెలల తర్వాత బూస్టర్ బోడ్ తీసుకొనేలా చర్యలు తీసుకొంది. ఇదే సమయంలో సింగిల్ డోస్ వ్యాక్సిన్ జాన్సన్ అండ్ జాన్సన్ టీకాకు మాత్రం బూస్టర్ డోస్‌కు రెండు నెలల గ్యాప్ సరిపోతుందని అగ్రరాజ్యం పేర్కొంది.