Talibans: ఆఫ్ఘాన్ ఆధిపత్యం కోసం పోటీపడుతున్న ఆ నలుగురు

Talibans: ప్రతిక్షణం ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని జీవనం * దొరికిన విమానం ఎక్కి, దేశాన్ని వదిలి వెళ్లేందుకు పరుగులు

Update: 2021-08-17 04:31 GMT
తాలిబన్ భయం తో దేశం వదిలి వెళ్లిపోతున్నా ప్రజలు (ఫైల్ ఇమేజ్)

Taliban: ఆఫ్ఘనిస్థాన్‌లో దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. ప్రతిక్షణం ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని బతుకుతున్నారు అక్కడి ప్రజలు. దొరికిన విమానం ఎక్కి, దేశాన్ని వదిలి వెళ్లేందుకు పరుగులు పెడుతున్నారు. ఇక తాలిబన్లు అనుకున్నది సాధించారు. తమ పంతాన్ని నెగ్గించుకున్నారు. అమెరికా బలగాల ఉపసంహరణ క్రమంలో.. అనూహ్య వేగంతో ప్రభుత్వాన్ని కూలదోసి, మళ్లీ తమ పాలన ఆరంభించారు. తిరుగుబాటుకు నేతృత్వం వహించినవారే పాలనలోనూ కీలకంగా వ్యవహరించనున్నారు.

అయితే.. ఇప్పుడు ఆఫ్ఘన్‌ను పాలించేదెవరనేది ప్రశ్నగా మారింది. చక్రం తిప్పేవారిలో ముఖ్యంగా నలుగురు నేతల పేర్లు వినిపిస్తున్నాయి. అందులో మొదటి వ్యక్తి సిరాజుద్దీన్‌ హక్కానీ. అమెరికాపై దాడి చేయడమే లక్ష్యంగా ఏర్పాటైన ఉగ్రవాద సంస్థ 'హక్కానీ నెట్‌వర్క్‌'కి అధిపతి. సోవియట్‌ వ్యతిరేక ముజాహిదీన్‌ కమాండర్‌ జలాలుద్దీన్‌ హక్కానీ కుమారుడే సిరాజుద్దీన్‌. ప్రస్తుతం తాలిబన్‌ డిప్యూటీ లీడరుగా ఉన్నాడు. నాటో దళాలకు హక్కానీ నెట్‌వర్క్‌ సంస్థ.. కొరకరాని కొయ్యలా తయారైంది.

ఇక రెండో వ్యక్తి హైబతుల్లా అఖుంజాదా. తాలిబన్‌ సంస్థ ప్రస్తుత 'సుప్రీం లీడర్‌'. ఈయన గత అగ్రనేతల వద్ద పనిచేశాడు. సామాన్య జీవనశైలిని ఆచరిస్తాడు. మతపర వ్యవహరాలన్నీ ఈయన ఆధ్వర్యంలోనే జరుగుతాయి. 2016లో అమెరికా జరిపిన డ్రోన్‌ దాడుల్లో తాలిబన్‌ నాయకుడు ముల్లా మన్సూర్‌ అక్తర్‌ మరణించగా, ఆయన స్థానంలో హైబతుల్లా బాధ్యతలు చేపట్టాడు. తాలిబన్‌ వర్గాలన్నింటినీ ఏకతాటిపైకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించాడు.

మూడో వ్యక్తి రహ్‌బారి షురా. ఇది తాలిబన్‌ సంస్థలోని అత్యున్నత నాయకత్వ మండలి. తాలిబన్ల అంతర్గత రాజకీయ ఏకాభిప్రాయానికి వేదిక. రాజకీయాలకు సంబంధించి సుప్రీం లీడర్‌ నిర్ణయాలు తీసుకోవడానికి ముందు తప్పనిసరిగా షురా అనుమతి తీసుకోవాలి.

నాలుగో వ్యక్తి ముల్లా అబ్దుల్‌ ఘనీ బరాదర్‌. తాలిబన్‌ రాజకీయ విభాగానికి ఇతడే అధిపతి. 1970ల్లో ఆఫ్ఘాన్‌ను సోవియట్‌ ఆక్రమించుకోవడంతో తిరుగుబాటు బృందంలో చేరాడు. 'ఆఫ్ఘాన్‌ ముజాహిదీన్‌' తరఫున పోరాడాడు. సోవియట్‌ దళాలు వెళ్లిపోయిన తర్వాత దేశంలో అవినీతి, అంతర్యుద్ధం చెలరేగాయి. అప్పటికే ఒంటి కన్ను ముల్లా ఒమర్‌తో కలిసి మదర్సాను స్థాపించిన బరాదర్‌.. తర్వాత అతడితో కలిసి తాలిబన్‌ ఉద్యమాన్ని ప్రారంభించాడు. 

Tags:    

Similar News