గాలిని విక్రయిస్తున్న కొలంబియా యువకుడు.. ఒక్కో బాటిల్ ధర రూ.400 పైమాటే
*మెడలిన్ ఎయిర్ పేరుతో సీసాల్లో గాలి విక్రయం
Colombia: ఓ 20 ఏళ్ల క్రితం నీటిని విక్రయిస్తున్నారంటే ఆశ్చర్యంగా చూసేవారేమో ఎందుకంటే ప్రకృతిలో పుష్కలంగా, సహజంగా అందరికీ దొరికే వనరు నీరు. అలాంటి నీటిని కొనేవారు కూడా ఉన్నారా? అని ముక్కున వేలేసుకునేవారు. కానీ ఇప్పుడు తాగునీటి వ్యాపారం సర్వసాధారణం అయిపోయింది. పల్లెల్లోనూ మినరల్ వాటర్ పేరిట బాటిళ్లలో నీటిని విక్రయిస్తుండడం కనిపిస్తుంది. ప్రకృతిలో సహజంగా లభించే మరో వనరు గాలి.. దీన్ని కూడా అమ్మేస్తే పోలా? అని ఓ యువకుడు భావించాడేమో.. అనుకున్నదే తడువుగా గాలిని విక్రయించడం మొదలు పెట్టాడు ఓ బాటిల్ గాలిని 5 డాలర్లకు విక్రయిస్తున్నాడు.. అంటే మన రూపాయాల్లో చెప్పుకోవాలంటే 4వందలకు విక్రయిస్తున్నాడు. ఇది విన్నాక ఆశ్చర్యమేస్తుంది కదూ కానీ ఇది నిజం కొలంబియాకు చెందిన జూవాన్ కార్లోస్ అల్వరాడో చిన్న చిన్న బాటిళ్లలో గాలిని విక్రయిస్తున్నాడు.
కొలంబియాలోని మెడలిన్ ప్రాంతం అద్భుతమైన ప్రకృతి అందాలకు, స్వచ్ఛమైన వాతావరణానికి పేరు. ఇక్కడి ప్రకృతి అందాలను ఆస్వాధించేందుకు ఏటా వేలాది మంది పర్యాటకులు వస్తారు. ఇక్కడి స్వచ్ఛమైన గాలిని క్యాస్ చేసుకోవాలని జువాన్ కార్లోస్ నిర్ణయించుకున్నాడు. అనుకున్నదే తడువుగా.. మెడలిన్ ఎయిర్ పేరుతో చిన్న చిన్న బాటిళ్లను విక్రయించడం ప్రారంభించాడు. మెడలిన్ నాణ్యమైన, సహజమైన గాలిని ఆస్వాధించడంటూ.. ఆ బాటిళ్లను అమ్ముకుంటున్నాడు. గాలిని అమ్మడమేమిటి? అని విమర్శలు వచ్చినా.. కార్లొస్ మాత్రం లెక్కచేయడం లేదు. అసలు ప్రకృతిలో లభించే గాలిని ఒడిసి పట్టుకుని.. దాన్ని బాటిళ్లలో నింపడం ఎంత కష్టమో మీకు తెలుసా? అంటూ కార్లోస్ ప్రశ్నిస్తున్నాడు. శుద్ధి చేసిన గాలిని ఒక్కో బాటిల్ విక్రయించడానికి కనీసం పావుగంట నుంచి అరగంట దాకా పడుతుందని, అందుకు తాను ప్రత్యేక పరికరాన్ని వాడుతున్నానని కార్లోస్ చెప్పుకుంటున్నాడు.
ఒక్కో బాటిల్‌ను 5 డాలర్లకు చొప్పున పర్యాటకులకు అమ్ముతున్నాడు. మొదట్లో తక్కువ బాటిళ్లు అమ్ముడయ్యేవని.. ఇప్పుడు వందల్లో విక్రయిస్తున్నట్టు కార్లోస్ చెబుతున్నాడు. అయితే పర్యాటకులు కొందరు ఆ మెడలిన్ ఎయిర్ బాటిళ్లను సరదాగా ఉందని కొనుగోలు చేస్తున్నారు. మరి కొందరు మాత్రం వింతగా చూస్తున్నారు. ఖాళీ బాటిళ్లను విక్రయిస్తూ.. కార్లోస్ మోసం చేస్తున్నాడని కొందరు విమర్శలు చేస్తున్నారు. అయినా కూడా కార్లోస్ మాత్రం తన పని తాను చేసుకుపోతున్నాడు. ఎంచక్కా గాలిని అమ్మి.. క్యాస్ చేసుకుంటున్నాడు. అతడి గాలి బాటిళ్ల విక్రయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. భలే వ్యాపారం ప్రారంభించారే అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. గాలిని అమ్మడమేమిటంటూ కొందరు సోషల్ మీడియాలోనూ విమర్శలు గుప్పిస్తున్నారు. అయినా.. కార్లోస్ మాత్రం గాలిని విక్రయించేది ఆపేది లేదంటూ దూసుకెళ్తున్నాడు.