Turkey: శవాల దిబ్బగా మారిన తుర్కియా.. గుట్టలు గుట్టలుగా మృత దేహాలు

Turkey: చెట్లను నరికి కొత్త శ్మశానాలు ఏర్పాటు

Update: 2023-02-14 03:03 GMT

Turkey: శవాల దిబ్బగా మారిన తుర్కియా.. గుట్టలు గుట్టలుగా మృత దేహాలు

Turkey: అణువుగా మొదలయ్యే మనిషి ప్రస్థానం, ఆరడగుల భూమిలో ముగుస్తుందంటారు. కానీ ఆఖరు ప్రస్థానానికి అవసరమైన ఆ ఆరడుగుల నేల కూడా దొరకని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు తుర్కియే ప్రజలు. ఇటీవల సంభవించిన భూకంపాలు, ఇక్కడ ప్రజల్ని వేల సంఖ్యలో బలితీసుకున్న సంగతి తెలిసిందే. ఒక్కసారిగా వచ్చిపడిన ఈ విపత్తును తట్టుకునే స్థాయిలో శ్మశానాలు లేవు. దీంతో హృదయ విదారక దృశ్యాలు కనిపిస్తున్నాయి.

చెట్లను నరికి మరీ కొత్త శ్మశానాలను ఏర్పాటు చేస్తున్నారు. మరాష్‌ జనాభా అయిదు లక్షల వరకూ ఉండగా.. 10వేలమందిని భూకంపాలు పొట్టనపెట్టుకున్నాయని అధికారులు వెల్లడించారు. ఇప్పటికే 5వేల మృతదేహాలను సామూహిక ఖననం చేశారు. ఓవైపు వాహనాలు నిరంతరం మృతదేహాలను తీసుకొస్తుండగా, మరోవైపు యంత్రాలతో నిర్విరామంగా గోతులను తీస్తున్నారు. కాగా, తుర్కియే, సిరియాలో 50 వేలమంది మృతిచెందారని, సంఖ్య మరింతగా పెరగవచ్చునని భావిస్తున్నారు.

ప్రస్తుతం భవనాల శిథిలాలను తొలగించే పని కొనసాగుతోందని వెల్లడించారు. భూకంప విలయంతో దేశంలో వేలాదిమంది ప్రజలు తమ గూడు కోల్పోయారు. ఆహారం కోసం బారులు తీరుతున్నారు. మరోవైపు.. భవనాల శిథిలాల నుంచి క్షతగాత్రులు, మృతుల వెలికితీత కొనసాగుతోంది. థర్మల్‌ కెమెరాలు, శునకాల సాయంతో అధికారులు జల్లెడ పడుతున్నారు. కాగా, భూకంప బాధిత ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు మైనస్‌ 6 డిగ్రీలకు పడిపోతుండడంతో మున్ముందు సహాయక చర్యలు కష్టమేనని అధికారులు చెబుతున్నారు.

భూకంప కేంద్రం నుంచి సుమారు 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న పొలాట్‌ గ్రామంలో ఒక్క ఇల్లూ మిగలకపోవడం గమనార్హం. నీడ లేక, తమ సొంత ఊరిని వదలలేక ఎంతోమంది ప్రజలు తీవ్ర వేదనను అనుభవిస్తున్నారు. విపత్తు విషయంలో ప్రభుత్వ స్పందన బాలేదంటూ ప్రజల నుంచి ఆగ్రహం వ్యక్తమవుతోంది. వచ్చే మే నెలలోనే ఎన్నికలు ఉన్న నేపథ్యంలో, ఈ పరిణామం దేశాధ్యక్షుడు ఎర్డోగన్‌కు ప్రతికూలంగా మారొచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Tags:    

Similar News