China: నెల రోజులుగా కరోనా విజృంభణతో వణికిపోతున్న చైనాలో పరిస్థితులు మరింత దిగజారుతున్నాయి. నాలుగు వారాలుగా లాక్ డౌన్ ఆంక్షలు అమలు చేస్తున్నప్పటికీ కరోనా ఉధృతి మాత్రం తగ్గడం లేదు. ఒక్క షాంఘైలోనే 24 గంటల్లో 39 మంది కోవిడ్ బాధితులు మృతిచెందారు. దీంతో నగరంలో కరోనా మృతుల సంఖ్య 87కి చేరింది. మరోవైపు చైనా రాజధాని బీజింగ్‌లోనూ పదుల సంఖ్యలో పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి. దీంతో అప్రమత్తమైన అధికారులు బీజింగ్‌లో వైరస్ కట్టడి చర్యలు ముమ్మరం చేశారు.
చైనాలో ఒక్కరోజే 21వేల 796పాజిటివ్ కేసులు నమోదైనట్లు ఆ దేశ ఆరోగ్య విభాగం వెల్లడించింది. బీజింగ్‌లోని ఓ పాఠశాలకు చెందిన పది మంది విద్యార్థులు వైరస్ బారిన పడ్డారు. దీంతో ఆ పాఠశాలను మూసివేసిన అధికారులు.. ట్రాకింగ్ చేపట్టారు. చైనాలో షాంఘై కాకుండా మరో 16 ప్రావిన్సుల్లో వైరస్ వ్యాప్తి కొనసాగుతుంది. ప్రస్తుతం చైనాలో 29వేల 532యాక్టివ్ కేసులు ఉన్నాయి. అటు కఠిన లాక్‌డౌన్ అమలుతో అక్కడి ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది.