కాబూల్‌ ఎయిర్ పోర్టు ఆత్మాహుతి దాడుల్లో 103 కి చేరిన మృతుల సంఖ్య

Update: 2021-08-27 07:30 GMT

కాబుల్ ఎయిర్ పోర్ట్ లో మృతి చెందిన పౌరులు (ట్విట్టర్ ఫోటో)

Afghanistan: ఆఫ్ఘనిస్తాన్ భయానకంగా మారిపోయింది. ప్రాణభయంతో దేశం నుంచి పారిపోతున్న వారిని కూడా ఉగ్రవాదులు వదలడంలేదు. కాబూల్‌ ఎయిర్ పోర్టుపై జరిగిన ఆత్మాహుతి దాడుల్లో మృతుల సంఖ్య 103కు పెరిగింది. ఈ దాడిలో 13మంది అమెరికా సైనికులు మరణించగా 90 మంది ఆఫ్ఘన్ వాసులు ప్రాణాలు కోల్పోయారు. గాయపడిన వారి సంఖ్య 150కి చేరింది. ఈ దాడికి ఐఎస్‌ఐఎస్‌-ఖోర్సా బాధ్యత తీసుకొంది. మృతుల్లో 28 మంది తమ వారు కూడా ఉన్నారని తాలిబన్లు ప్రకటించారు.

అఫ్గాన్‌ అధ్యక్షుడిగా ప్రకటించుకున్న అమ్రుల్లా సలేహ్‌ ఈ ఘటనపై స్పందించారు. ''తాలిబన్లు- హక్కానీ నెట్‌వర్క్‌ల్లో ఐసిస్‌-కె మూలాలు ఉన్నాయి. కానీ తాలిబన్లు దీనిని తిరస్కరించడం ఎలా ఉందంటే ఒకప్పుడు క్వెట్టా షురా అనే మిలిటెంట్‌ సంస్థతో సంబంధాలు లేవని పాక్‌ చెప్పినట్లుంది. తన గురువు నుంచి తాలిబన్లు చాలా నేర్చుకొన్నారు'' అని ఆయన ట్వీట్‌ చేశారు.

మరిన్ని దాడులు జరగొచ్చు..!

కాబుల్‌ విమానాశ్రయంపై మరిన్ని దాడులు జరిగే అవకాశాలు ఉన్నాయని అమెరికా సెంట్రల్‌ కమాండ్‌ జనరల్‌ ఫ్రాంక్‌ మెకంన్జీ ప్రకటించారు. ఈ సారి రాకెట్లు.. వాహన బాంబులతో ఎయిర్‌పోర్టును లక్ష్యంగా చేసుకోవచ్చని హెచ్చరించారు. ఇలాంటి పరిస్థితిని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు.

* శ్వేత సౌధంపై అమెరికా పతాకాన్ని ఆగస్టు 30 సాయంత్రం వరకు సగం ఎత్తులోనే ఎగరవేయనున్నారు. అఫ్గాన్‌లోని కాబుల్‌లో జరిగిన దాడిలో మృతిచెందిన వారికి సంతాపంగా ఈ నిర్ణయం తీసుకొన్నారు.

2011 తర్వాత ఇదే పెద్దదాడి..!

కాబుల్‌ విమానాశ్రయంపై జరిగిన దాడిలో 13 మంది అమెరికన్‌ సైనికులు మరణించారు. 2011 తర్వాత ఈ స్థాయిలో అమెరికన్ల మరణాలు నమోదైంది ఇప్పుడే. రెండు దశాబ్దాలపాటు జరిగిన అఫ్గాన్‌ యుద్ధంలో 1909 మంది అమెరికన్లు మరణించారు. 2011 ఆగస్టు 6వ తేదీన ఉగ్రవాద శిబిరంపై అమెరికా చినూక్‌ హెలికాఫ్టర్‌ దాడికి దిగింది. ఈ సమయలో ఉగ్రవాదులు హెలికాప్టర్‌ను కూల్చివేశారు. ఈ ఘటన వార్దక్‌ ప్రావిన్స్‌లో చోటుచేసుకుంది. ఈ దాడిలో 22 నేవీ సీల్స్‌ సహా 30 మంది అమెరికా సిబ్బంది మరణించారు. మరో 8 మంది అఫ్గాన్‌ పౌరులు, ఓ అమెరికా జాగిలం కూడా మరణించింది.

దేశాన్ని ఆక్రమించి తమవైపు దూసుకొస్తున్న తాలిబన్లకు తలొగ్గేది లేదని పంజ్‌షేర్‌ సైనికులు తేల్చి చెప్పారు. తాలిబన్లతో రాజీపడే ఉద్దేశమే లేదని, వారి అంతు చూస్తామని ప్రకటించారు. తాలిబన్లపై పోరాడేందుకు ఉత్తర కూటమితో అఫ్గానిస్థాన్‌ ఆర్మీ మాజీ కమాండర్‌ చేతులు కలిపినట్లు తెలుస్తోంది. అలాగే అఫ్గాన్‌ ప్రజలు సైతం వారికి మద్దతుగా నిలుస్తున్నారు. పొరుగుదేశం తజకిస్థాన్‌ సైతం పంజ్‌షేర్‌ సైనికులకు మద్దతు పలికింది.

Tags:    

Similar News