జగన్‌పై దాడి కాదు.. హత్యాయత్నం...అసలు ఫ్లెక్సీలోకి గరుడ పక్షి ఎలా వచ్చింది...
జగన్‌పై జరిగింది.. దాడి కాదని అది ముమ్మాటికీ హత్యాయత్నమే అని వైసీపీ మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. సిటీ న్యూరో ఆస్పత్రిలో జగన్‌ను పరామర్శించిన ఆయన దుండగుడు శ్రీనివాసరావు కత్తితో జగన్ గొంతుపైకి దూసుకొచ్చాడని అయితే అకస్మాత్తుగా జగన్ జరగడంతో కత్తి వేటు చేయిపై పడిందన్నారు. దీంతో భారీ ప్రమాదం తప్పిందని సుబ్బారెడ్డి తెలిపారు.
మరోవైపు నిందితుడు శ్రీనివాసరావు వైసీపీ అభిమాని అంటూ తెరపైకి వచ్చిన ఫ్లెక్సీపై కూడా అనుమానాలు వ్యక్తం చేశారు. ఫ్లెక్సీలో పసుపుపచ్చ రంగు ఉందని అలాంటి రంగు వైసీపీ నాయకులు ఎందుకు వాడుతారంటూ వైవీ సుబ్బారెడ్డి ప్రశ్నించారు. అలాగే ఫ్లెక్సీలో వైఎస్ బొమ్మ కూడా లేదన్నారు. అసలు ఫ్లెక్సీలోకి గరుడ పక్షి ఎలా వచ్చిందని వైవీ సుబ్బారెడ్డి ప్రశ్నించారు.
జగన్‌పై జరిగిన హత్యాయత్నం ముమ్మాటికీ చంద్రబాబు చేసిన కుట్రనే అని వైవీ సుబ్బారెడ్డి ఆరోపించారు. అందుకే చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న దర్యాప్తుపై తమకు నమ్మకం లేదని తెలిపారు. థర్డ్ పార్టీ ఏజెన్సీతో దర్యాప్తు కేసు విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. ఈ కేసులో ఏ 1 గా చంద్రబాబు, ఏ 2 గా ఏపీ డీజీపీ పేరు పెట్టాలన్నారు. అన్ని వివరాలతో ఈ సాయంత్రం హైకోర్టులో పిటీషన్ వేస్తామని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.