Jyothula Nehru: తిరుపతి తొక్కిసలాటలో ప్రాణాలు పోవడం వారి అదృష్టం.. జ్యోతుల నెహ్రూ వివాదాస్పద వ్యాఖ్యలు
Jyothula Nehru comments on Tirupati stampede: తిరుపతి తొక్కిసలాట ఘటనపై టీటీడీ బోర్డ్ మెంబర్, ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. "దైవ సన్నిధిలో అసువులు బాసటం అనేది ఒక రకంగా అదృష్టమే అయినప్పటికీ ముక్తి కోసం వెళ్లి ప్రాణాలు విడిచినటువంటి పరిస్థితి" అని జ్యోతుల నెహ్రూ అన్నారు. ఆదివారం విశాఖపట్నంలో తిరుపతి తొక్కిసలాట ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు చెక్కుల పంపిణి కార్యక్రమం జరిగింది. ప్రభుత్వం ప్రకటించిన ఎక్స్ గ్రేషియా చెక్కులను అందజేసేందుకు హోంమంత్రి వంగలపూడి అనిత కూడా అక్కడికొచ్చారు. ఈ చెక్కుల పంపిణీ సందర్భంగా మాట్లాడుతూ జ్యోతుల నెహ్రూ ఈ వ్యాఖ్యలుచేశారు.
జ్యోతుల నెహ్రూ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం పెనుదుమారం రేపుతున్నాయి. ఇప్పటికే తిరుమల తిరుపతి దేవస్థానంలో వెంకన్న దర్శనం కోసం వెళ్లగా జరిగిన తొక్కిసలాటలో జనం అర్థాంతరంగా ప్రాణాలు కోల్పోయారు అనే వాదన వినిపిస్తోంది. తిరుపతి తొక్కిసలాట ఘటనలో వైఫల్యం ఎవరిది అనే విషయంలో పెద్ద చర్చే నడుస్తోంది. ఈ ఘటన అటు టీటీడీ బోర్డుపై, ఇటు ఏపీ సర్కారుపై పలు విమర్శలకు తావిచ్చింది.
ఈ వివాదం ఇలా ఉండగానే ఇప్పుడు జ్యోతుల నెహ్రూ ఇలా వ్యాఖ్యానించడం అధికార తెలుగు దేశం పార్టీని ఇరకాటంలో పడేసింది. తిరుపతి ఘటనకు బాధ్యత వహించాల్సిన అధికార పార్టీనే ఇలా మృతుల కుటుంబాలు నొచ్చుకునేలా బాధ్యాతారాహిత్యంగా మాట్లాడటం ఏంటని వైసీపీ నేతలు నిలదీస్తున్నారు.