రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏ పార్టీతో అయినా కలిసి పోరాడుతామన్నారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. హోదా అంశంపై ఎవరు అవిశ్వాసం పెట్టినా మద్దతిస్తామని, రేపటి టీడీపీ తీర్మానానికి కూడా అనుకూలంగా ఓటేస్తామని ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు. వైసీపీ అవిశ్వాస తీర్మానం చర్చకు వచ్చేదాకా ఎన్డీఏలో కొనసాగిన చంద్రబాబు.. చివరికి బయటికొచ్చి, అవిశ్వాసం పెడతాననడం సంతోషమన్నారు. ఏపీకి మేలు జరిగే ఏ తీర్మానానికైనా మద్దతిస్తామని వివరించారు.
చంద్రబాబు నేరగాడే అయినా.. : ‘‘దేశంలో చంద్రబాబును మించిన రాజకీయ- ఆర్థిక- సామాజిక నేరగాడు లేనేలేడు. ప్రజల రక్తాన్ని పీల్చుకున్న ఆయన.. తాను దోచిన ధనాన్ని విదేశాలకు తరలించాడు. ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్లు వక్రీకరించడంలో దిట్ట. మాటపై నిలబడలేని, అసలు విశ్వసనీయత అంటేనే తెలియని జీవి. సరే, నాలుగేళ్ల తర్వాతైనా కళ్లు తెరిచి, హోదా కోసం మాట్లాడుతున్నారు. శుక్రవారం వైఎస్సార్‌సీపీ అవిశ్వాస తీర్మానం చర్చకు వచ్చేదాకా ఎన్డీఏలో కొనసాగిన ఆయన.. చివరికి బయటికొచ్చి, అవిశ్వాసం పెడతాననడం సంతోషం. ఆంధ్రప్రదేశ్‌కు మేలు జరిగే ఏ తీర్మానానికైనా మద్దతిస్తామని, అది టీడీపీనా, మరొకరా అన్నది పట్టించుకోమని మా అధ్యక్షుడు వైఎస్ జగన్ ఇదివరకే చెప్పారు. ఇప్పుడు కూడా అదే చెబుతున్నాం’’ అని విజయసాయిరెడ్డి అన్నారు.