కేంద్రం ప్రవేశ పెట్టిన బడ్జెట్ ను ఏపీ ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. టీడీపీ , బీజేపీ, వైసీపీ , కాంగ్రెస్ పార్టీల నేతలు తమ అభిప్రాయాల్ని బహిరంగంగానే చెప్పేస్తున్నారు. రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంటే వైసీపీ ఎంపీలు ఏం మాట్లాడారని టీడీపీ నేతలు ప్రశ్నిస్తుంటే ..బడ్జెట్ గురించి ముందే తెలిసినా టీడీపీ నేతలు ఎందుకు ఖండించ లేదంటూ ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకుంటున్నారు. అయితే ఇరు పార్టీల నేతల విమర్శల్ని అంచనా వేస్తే ..కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ గురించి సీఎం చంద్రబాబుకు ముందే తెలుసనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
బడ్జెట్ లో ఏపీకి జరిగిన అన్యాయానికి చంద్రబాబు బీజేపీని ప్రశ్నిస్తున్నారు. విభజన చట్టం హామీ ప్రకారం బడ్జెట్ లో రాష్ట్రానికి నిధులు ఎందుకు కేటాయించలేదని అడుగుతున్నారు. పనిలో పనిగా ప్రతిపక్షనేత జగన్ ను ఇరుకున పెట్టే ప్రయత్నం చేశారు. బడ్జెట్ ను వ్యతిరేకిస్తున్న వైసీపీ ఎంపీలు ఎందుకు రాజీనామా చేయలేదో జగన్ చెప్పాలంటూ డిమాండ్ చేశారు. అయితే చంద్రబాబు డిమాండ్ పై స్పందించిన జగన్ బడ్జెట్ గురించి ముందే తెలిసిన టీడీపీ నేతలు ఎందుకు ఆందోళన చేస్తున్నారో అర్ధం కావడం లేదని అన్నారు. బడ్జెట్ లో రాష్ట్రానికి అన్యాయం జరుగుతున్నా చంద్రబాబు ఆపలేకపోవడాన్ని తప్పుబట్టారు.
సాధారణంగా కేంద్రంలో ఏదైనా బిల్లుకు కార్యరూపం దాల్చి చివరి అంకానికి వచ్చే సమయంలో పీఎం మోదీ ఆ కేంద్ర కేబినెట్ కు చెందిన మంత్రులతో భేటీ నిర్వహిస్తారు. ఆ భేటీలో బిల్లు గురించి ప్రస్తావించి, అందులో లోపాలు , అభిప్రాయాల్ని సేకరిస్తారు. అనంతరం బిల్లు ప్రవేశ పెడతారు. అలా మోదీ కేబినెట్ లో ఉన్న టీడీపీ మంత్రులు సుజనా చౌదరి, అశోక్ గజపతిరాజులకు ప్రవేశపెట్టబోయే బడ్జెట్ గురించి ముందే తెలుసని, అయినా అధినేత చంద్రబాబు ఆపే ప్రయత్నం చేయకుండా, ఇప్పుడు రాష్ట్రానికి అన్యాయం జరిగిందని మాట్లాడడం విడ్డూరంగా ఉందని వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు.