ఏపీ ప్రతిపక్ష నాయకుడు.. వైసీపీ అధినేత జగన్ మోహన్‌రెడ్డిపై దాడి జరిగింది. ఇవాళ ఉదయం హైదరాబాద్‌కు వచ్చేందుకు విశాఖ ఏయిర్‌పోర్ట్‌కు వచ్చిన జగన్‌పై.. అక్కడే ఉన్న శ్రీనివాసరావు అనే వ్యక్తి కత్తితో దాడి చేశాడు. సెల్ఫీ తీసుకుంటానంటూ జగన్ దగ్గరకు వచ్చిన శ్రీనివాస్ రావు.. కోడిపందేల్లో ఉపయోగించే కత్తితో దాడి చేశాడు. దీంతో జగన్ ఎడమ చేయి పై భాగాన.. భుజం కింద రక్తస్రావమైంది. వెంటనే స్పందించిన జగన్ సెక్యూరిటీ.. శ్రీనివాసరావును అడ్డుకోవడంతో.. స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ముందుగా లాంజ్‌లో వెయిట్ చేస్తున్న జగన్ కు టీ ఇచ్చిన శ్రీనివాసరావు.. సార్ 160 సీట్లు వస్తాయా అంటూ పలకరించాడు. తర్వాత సెల్ఫీ తీసుకుంటానంటూ.. కత్తితో దాడికి పాల్పడ్డాడు. వెంటనే అలర్ట్ అయిన ఎయిర్‌పోర్ట్ పోలీసులు.. శ్రీనివాసరావును అదుపులోకి తీసుకున్నారు. అతడు ఎయిర్‌పోర్టులోని క్యాంటీన్‌లో వెయిటర్‌గా పనిచేస్తున్నట్లు ప్రాథమికంగా పోలీసులు గుర్తించారు. మరోవైపు జగన్‌కు ప్రథమ చికిత్స జరిగిన తర్వాత.. హైదరాబాద్ కు బయల్దేరి వెళ్లారు. మరోవైపు హైదరాబాద్‌కు చేరుకున్న జగన్‌కు శంషాబాద్ ఎయిర్‌పోర్టులో కూడా వైద్యులు పరీక్షించారు. తర్వాత ఆయన నేరుగా సిటీ న్యూరో ఆస్పత్రికి వెళ్లారు. అక్కడ ఆయన భుజానికి చికిత్స చేస్తున్నారు. ఇటు విషయం తెలుసుకున్న జగన్ భార్య.. భారతీరెడ్డి జగన్ కంటే ముందుగానే ఆస్పత్రికి చేరుకున్నారు. ఇక ఆస్పత్రి ప్రాంగణం.. జగన్ అనుచరులతో కిక్కిరిసిపోయింది. వేలాదిగా తరలివచ్చిన అభిమానులు.. చంద్రబాబు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇదిలా ఉండగా.. తన ఆరోగ్యంపై జగన్ ట్వీట్ చేశారు. తాను ఆరోగ్యంగా ఉన్నట్లు వివరించారు. కార్యకర్తలెవరూ ఆందోళన చెందవద్దని.. ప్రజల ఆదరాభిమానాలు, ఆశిస్సులే తనను కాపాడాయని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఇలాంటి పిరికి చర్యలకు భయపడేది లేదన్న జగన్.. ప్రజల సంక్షేమం కోసం మరింత కష్టపడి పనిచేస్తానని చెప్పారు. మరోవైపు ఘటనపై తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ స్పందించారు. వెంటనే ఏపీ డీజీపీ ఠాకూర్‌తో మాట్లాడారు. తనకు పూర్తిస్థాయి నివేదికను పంపించాలని ఆదేశించారు. ఇటు ఏపీ ప్రభుత్వం కూడా జరిగిన దాడిని ఖండించింది. జగన్‌పై దాడి చేసింది ఎవరు..? దీని వెనుక ఎవరున్నారనే విషయాన్ని త్వరలోనే చెబుతామని.. హోంమంత్రి చినరాజప్ప స్పష్టం చేశారు. ప్రతిపక్ష నాయకుడు జగన్‌పై దాడిని జనసేన ఖండించింది. జగన్‌పై హత్యాయత్నాన్ని ప్రజాస్వామ్యవాదులంతా ముక్త కంఠంతో ఖండించాల్సిన అవసరం ఉందని.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. ఇలాంటి ఘటనలు.. పునరావృతం కాకుండా.. చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలదని అన్నారు. జగన్ పై దాడి ఘటనపై తెలంగాణ మంత్రి కేటీఆర్ కూడా స్పందించారు.