వివాహేతర సంబంధానికి అడ్డు పడుతుందని వదినను ఆడపడుచు తన ప్రియుడితో కలిసి హత్య చేసిన ఉదంతమిది. కర్నూల్ జిల్లా గోవిందపల్లెలో గత ఆదివారం జరిగిన మహిళ హత్య కేసులో పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. గురువారం స్థానిక సర్కిల్ కార్యాలయంలో డీఎస్పీ చక్రవర్తి వివరాలు వెల్లడించారు. గ్రామానికి చెందిన గంగదాసరి బాల నరసింహారెడ్డితో 15 ఏళ్ల క్రితం ఇందిరమ్మకు వివాహమైంది. కుటుంబంలో కలహాలు రావడంతో ఆమె 12 ఏళ్లుగా పుట్టింటిలో తల్లి చిన్న లక్ష్మమ్మ, అన్న వెంకటేశ్వరరెడ్డి, వదిన సునీతతో కలిసి ఉండేది.
గోవిందపల్లెలో ఈనెల 17న ఇందిరమ్మ హత్యకు గురైంది. ఆమెను అన్న భార్య సునీత, ఆమె ప్రియుడు సుబ్బారెడ్డి గొంతు నులిమి హత్య చేశారని ఆళ్లగడ్డ డీఎస్పీ చక్రవర్తి, సీఐ యుగంధర్‌బాబు గురువారం విలేఖర్లకు తెలిపారు. గోస్పాడు మండలం దీబగుంట్లకు చెందిన కాకనూరు సుబ్బారెడ్డితో గోవిందపల్లెకు చెందిన సంగిరెడ్డి సునీతకు కొన్నేళ్లుగా వివాహేతర సంబంధం ఉంది. ఈ వ్యవహారానికి ఇందిరమ్మ అడ్డు పడుతుండడంతో సునీత, సుబ్బారెడ్డి ఆమెను హత్య చేయాలని నిర్ణయించుకున్నారు. ఇందిరమ్మ తల్లి చిన్న లక్ష్మమ్మ, అన్న వెంకటేశ్వరరెడ్డి రోజూలాగే ఆదివారం తెల్లవారుజామున 4.30 గంటలకు గ్రామంలోని తమ పశువుల పాకను శుభ్రం చేయడానికి వెళ్లారు. 5 గంటల ప్రాంతంలో సునీత, సుబ్బారెడ్డి ఇందిరమ్మ ఇంట్లోకి ప్రవేశించి నిద్రిస్తున్న ఆమె మెడకు టవల్‌ను చుట్టి ఊపిరి ఆడకుండా చేసి హత్యచేశారు. చనిపోయిందని నిర్ధారించుకుని మెడలోని బంగారు గొలుసు, నాలుగు గాజులు తొలగించారు. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో ప్రత్యేక పోలీసు బృందం గోస్పాడు మండలం సాంబవరం మెట్ట కాశిరెడ్డి నాయన ఆశ్రమం వద్ద నిందితులను అరెస్ట్ చేసింది. ఈసందర్భంగా వారి నుంచి 2 తులాల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకుంది. కేసు ఛేదించడంలో కీలకపాత్ర పోషించిన సీఐ యుగంధర్, శిరివెళ్ల, గోస్పాడు, సంజామల ఎస్‌ఐలు సుధాకరరెడ్డి, హనుమంతయ్య, విజయభాస్కర్‌ను డీఎస్పీ అభినందించారు.