తిరుపతిలో నిపా వైరస్ కలకలం సృస్తిస్తోంది. ఇటీవల కేరళలో వైద్యురాలిగా పనిచేసి తిరుపతికి వచ్చిన మహిళకు నిపా వైరస్ లక్షణాలున్నట్టు గుర్తించడంతో ఆమెను తిరుపతిలోని రుయా ఆసుపత్రికి తరలించారు. ఇందుకు సంబంధించి సదరు వైద్యురాలు చికిత్స తీసుకుంటున్నారు. అత్యంత ప్రాణాంతకమైన ‘నిపా’ వైరస్ భారత్ లో మొదటిసారిగా కేరళలో బయటపడింది. ఇప్పటి వరకూ ‘నిపా’ బారిన పడి పదిహేను మందికి పైగానే మరణించినట్టు అధికారికంగా తెలుస్తోంది. కాగా తిరుపతిలో నిపా లక్షణాలు ఉండటంతో ఆప్రాంత ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని తగిన జాగ్రత్తలు తీసుకుంటే ఈ వైరస్ వ్యాపించదని వైద్యులు అంటున్నారు. ఇదిలావుంటే నిపా దరిచేరకుండా ఇంటిపరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి, కొరికిన పండ్లను తినకూడదు, గబ్బిలాలు, పందులు, మృతిచెందిన పశువుల కళేబరాలను దూరంగా ఉంచాలని నిపుణులు చెబుతున్నారు.