భార్య తనను చిత్రహింసలకు గురిచేస్తోందంటూ.. విజయవాడలో ఓ భర్త కోర్టును ఆశ్రయించాడు. తనకు అబద్ధాలు చెప్పి పెళ్లి చేసుకోవడంతో పాటు.. పెళ్లైన కొద్ది రోజుల నుంచే భార్య తనను చిత్రహింసలు పెడుతోందంటూ బాధితుడు కోర్టు మెట్టులెక్కాడు. గృహహింస చట్టం కింద ఫిర్యాదు చేశాడు. కేసును విచారణకు స్వీకరించిన కోర్టు.. వచ్చే నెల 21న తదుపరి విచారణ చేపట్టనుంది.
విజయవాడకు చెందిన గోగు రామ్‌కుమార్‌కు నాగజ్యోతితో నాలు నెలల క్రితం వివాహమైంది. అయితే, పెళ్లయిన రెండు నెలలకే వివాదాలు మొదలయ్యాయి. తనతో వివాహనికి ముందే ఆమెకు పెళ్లయిందని.. పిల్లలు కూడా ఉ్ననారని రామ్ కుమార్ ఆరోపిస్తున్నాడు. విడాకులు తీసుకున్న విషయాన్ని గానీ, పిల్లలు ఉన్నారన్న విషయాన్ని గానీ నాకు చెప్పలేదని అంటున్నాడు. ఆ విషయం అడిగినందుకు తన భార్య చిత్రహింసలు పెడుతోందని కోర్టును ఆశ్రయించాడు.
భార్య తనపై 498(ఎ) కింద కేసు నమోదు చేసి, 10లక్షలు డబ్బు ఇవ్వాలని డిమాండ్ చేస్తోందని బాధితుడు వాపోతున్నాడు. తాను సాధారణ మెకానిక్‌నని అంత డబ్బు ఇచ్చుకోలేనని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. అందుకే న్యాయస్థానాన్ని ఆశ్రయించానని పిటిషన్‌లో పేర్కొన్నాడు. రామ్‌కుమార్ పిటిషన్‌ను విజయవాడ మొదటి అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు విచారణకు స్వీకరించింది. ఈ కేసులో తదుపరి విచారణను వచ్చేనెల 21న కోర్టు చేపట్టనుంది.
భర్త మోసం చేశాడని, చిత్రహింసలు పెడుతున్నాడని భార్య కోర్టు మెట్లెక్కడం సాధారణంగా చూస్తుంటాం. దీనికి భిన్నంగా భార్య తనను వేధిస్తోందంటూ ఓ భర్త ఫిర్యాదు చేయడం స్థానికంగా కలకలం రేపుతోంది. భార్య వేధింపులపై భర్త కోర్టు మెట్లెక్కి గృహహింస కేసు పెట్టడం ఏపీలో ఇదే మొదటి సారి. ఈ కేసును కోర్టు అంగీకరించడం భార్యా బాధితులకు లభించిన విజయమని రామ్ కుమార్ తరపు లాయర్ చెబుతున్నారు.