వీసా రాగానే తీసుకెళ్తానని చెప్పి..

Update: 2018-07-30 08:57 GMT

వరంగల్‌ హన్మకొండలో ఎన్ఆర్ఐ భర్త నిర్వాకం బయటికొచ్చింది. ఆస్ట్రేలియాలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న శ్రవణ్ నాలుగేళ్ల క్రితం పెళ్లి చేసుకొని భార్య తనుశ్రీని ఇక్కడే వదిలేసి వెళ్లిపోయాడు. వీసా వచ్చాక తీసుకెళ్తానని చెప్పి మోసం చేశాడు. ఇప్పుడు కాల్ కూడా చేయడం లేదు. తనను కాపురానికి తీసుకెళ్లకపోవడంతో అనుమానం వచ్చిన తనుశ్రీ భర్త ఇంటి ముందు న్యాయ పోరాటానికి దిగింది. 

పెళ్లైన తర్వాత భార్య తనుశ్రీకి కూడా వీసా అప్లై చేశాడు భర్త శ్రవణ్. వీసా రాకపోవడంతో పుట్టింట్లోనే వదిలేసి వెళ్లిపోయాడు. అప్పుడొస్తాను ఇప్పుడొస్తాను నిన్ను తీసుకెళ్తానంటూ రెండేళ్లు కాలం గడిపేశాడు. పెళ్లైన నాటి నుంచి తనుశ్రీ అత్తమామలు కూడా ఆమెను పట్టించుకోలేదు. దీంతో వరంగల్‌ నక్కలగుట్టలోని భర్త ఇంటి ముందు తల్లితో కలిసి బైఠాయించింది. భర్త ఫోన్ నెంబర్ కూడా ఇవ్వకుండా వేధిస్తున్నారని వాపోతోంది. కోడలు రాకను ముందే గమనించిన శ్రవణ్ తల్లిదండ్రులు ఇంటికి తాళం వేసి పరారయ్యారు.

తన భర్త శ్రవణ్ ఆస్ట్రేలియాలో వేరే అమ్మాయితో ఉంటున్నట్లు తనకు తెలిసిందని బాధితురాలు తనుశ్రీ చెప్తోంది. తన భర్త చేసిన మోసంపై బాధితురాలు తనుశ్రీ పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని వాపోతోంది. అందుకే భర్త ఇంటి ముందు న్యాయపోరాటానికి దిగినట్లు చెప్తోంది. తనకు న్యాయం చేయాలంటూ తనుశ్రీ డిమాండ్ చేస్తోంది. 

Similar News