ప్రభుత్వాలు తప్పుచేస్తే ప్రశ్నిస్తానన్న పవన్.... రివర్స్‌లో ప్రతిపక్షాన్ని టార్గెట్ చేయడంపై వైసీపీ నేతలు తలలు పట్టుకుంటున్నారు. పవన్ కల్యాణ్ టీడీపీ ముసుగు తొలిగిందని కౌంటర్ అటాక్ చేస్తున్నా... అసలెందుకు ఇంత సడన్‌గా జగన్‌ను డైరెక్ట్ టార్గెట్ చేశాడో అర్ధంకాక అయోమయానికి గురవుతున్నారు. అయితే అనంతలో పార్టీ ముఖ్యనేతలతో సమావేశమైన జగన్.... రెండుమూడ్రోజులు హడావిడి చేసి వెళ్లిపోయే పవన్‌ను లైట్ తీసుకోమని చెప్పినట్లు తెలుస్తోంది.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీరుపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు విస్తుపోతున్నారు. ప్రభుత్వాలను వదిలేసి ప్రతిపక్షాన్ని కార్నర్ చేయడంపై ఆశ్చర్చపోతున్నారు. ఇదేంటి ప్రశ్నించాల్సింది ప్రభుత్వాలను కదా? కానీ ఎందుకు డైరెక్ట్‌గా జగన్‌ను టార్గెట్ చేస్తున్నాడని మదనపడుతున్నారు. 2014 ఎన్నికల ప్రచారంలో సైతం జగన్‌పై ఇంత కఠినంగా విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టలేదంటున్న వైసీపీ నేతలు.... ఇప్పుడెందుకు సడన్‌గా కార్నర్ చేస్తున్నాడని విశ్లేషించుకుంటున్నారు.
జగన్‌పై కేసులుండటంతోనే వైసీపీకి మద్దతివ్వలేదని, తండ్రి చనిపోయిన వెంటనే ముఖ్యమంత్రి కావాలనుకోవడం తనకు నచ్చలేదని, అసెంబ్లీని బాయ్‌కాట్ చేయడం సరికాదని, సీఎం అయ్యాకే సమస్యలు పరిష్కరిస్తానంటే కుదరంటూ పవన్ చేసిన కామెంట్స్‌పై వైసీపీ నేతలు భగ్గుమంటున్నారు. అయితే అనంతపురంలో పార్టీ ముఖ్యనేతలతో సమావేశమైన జగన్.... పవన్ కల్యాణ్‌ని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని చెప్పినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలపైనా జగన్ చర్చించారు. పార్లమెంట్‌లో లేవనెత్తాల్సిన అంశాలపై ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. జనసేనాధిపతి కామెంట్స్‌తో వైసీపీ నేతలు ఒకింత ఆశ్చర్యానికి లోనైనా.... రెండుమూడ్రోజులు హడావిడి చేసి వెళ్లిపోయే పవన్‌ను లైట్ తీసుకుంటామంటున్నారు.