ఏపీకి కేంద్రం అందిస్తున్న సహాయంపై.. జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఏర్పాటు చేసిన ఉమ్మడి నిజ నిర్థారణ కమిటీ.. తుది నివేదక ఇచ్చేసింది. కేంద్రం నుంచి రాష్ట్రానికి 74 వేల 542 కోట్ల రూపాయలు రావాల్సి ఉందని లెక్క తేల్చింది. ప్రత్యేక హోదాకు ప్రత్యామ్నాయమే లేదని తేల్చి చెప్పింది. పోలవరం ప్రాజెక్టును నిర్మిస్తామని.. ఆ బాధ్యత తమదే అని కేంద్రం మాటలు చెప్పడం కాదన్న జేఎఫ్సీ.. ఆ దిశగా సత్వరం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పింది.
అలాగే.. వచ్చే ఐదేళ్ల పాటు.. ఏపీ ఆర్థిక లోటుతో కొనసాగుతుందన్న జనసేన చీఫ్ పవన్ కల్యాణ్.. ఆ భారాన్ని కేంద్రమే భరించాలని కూడా చెప్పారు. దీంతో పాటు.. విజయవాడ, విశాఖకు మెట్రో ను కూడా మంజూరు చేయాలని కోరారు. దీంతో.. బీజేపీ నేతలు ఇప్పుడు ఎలాంటి సమాధానం చెబుతారా అని అంతా ఎదురు చూస్తున్నారు. ఈ నివేదికలో ఎక్కడా చంద్రబాబు ప్రభుత్వాన్ని తప్పుబట్టని పవన్ కల్యాణ్.. నిందను మాత్రం పూర్తిగా కేంద్ర ప్రభుత్వంపైనే వేసేశారు.
దీంతో.. ఇప్పుడు బంతి బీజేపీ నేతల కోర్టులోనే పడింది. అది ఇప్పుడు ఎటువైపు తిరుగుతుందన్నది.. ముందు ముందు తేలనుంది. ఇప్పటికే పవన్ తీరును బీజేపీ నేతలు తప్పుబడుతుండగా.. ఇప్పుడు మరోసారి కేంద్రాన్ని జనసేన టార్గెట్ చేసింది. ఇదే సమయంలో.. టీడీపీతో బీజేపీకి గొడవలు ముదురుతున్నాయి. అవసరమైతే బంధాన్ని తెంచుకుంటామని తెలుగుదేశం నేతలు చెబుతున్నారు. తన రాజీనామాకు ఒక్క క్షణం చాలని కేంద్ర మంత్రి అశోక గజపతి రాజు కూడా తేల్చి చెప్పారు.
ఇలాంటి పరిస్థితుల్లో.. జనసేన జేఎఫ్సీ నివేదికను.. బీజేపీ ఎలా చూస్తుంది? ఏమని సమాధానం చెబుతుంది? చూడాల్సిందే.