ఓటుకు నోటు కేసును ఇప్పుడే ఎందుకు తోడుతున్నారు?

Update: 2018-05-08 10:39 GMT


ఓటుకు నోటు కేసుపై మరికాసేపట్లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ సమీక్ష నిర్వహించనున్నారు. డీజీపీ, ఏసీబీ ఉన్నతాధికారులు, న్యాయ నిపుణులతో సమావేశం కానున్న కేసీఆర్.... కేసు పురోగతిపై రివ్యూ చేయనున్నారు. ముఖ్యంగా ఫోరెన్సిక్‌ రిపోర్ట్‌, సేకరించిన ఆధారాలపైనే సమీక్ష జరగనుంది. ఇప్పటివరకూ సేకరించిన ఎవిడెన్స్‌ ఆధారంగా ఏపీ సీఎం చంద్రబాబు పేరును చేర్చడంపై చర్చించనున్నారు. అసలు చంద్రబాబు పేరును చేర్చేందుకు అవసరమైన ఆధారాలు ఉన్నాయో లేదో... సాధ్యాసాధ్యాలను న్యాయనిపుణులతో మాట్లాడనున్నారు.

ఓటుకు నోటు కేసే కాకుండా.... కాంగ్రెస్‌, టీడీపీ ప్రభుత్వాల హయాంలో నమోదైన అన్ని అవినీతి కేసులపైనా కేసీఆర్‌ చర్చించనున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో నమోదైన అవినీతి కేసుల ఫైళ్లు దుమ్ముదులుపుతున్న తెలంగాణ ప్రభుత్వం.... వాటన్నింటిపై సమగ్ర విచారణకు రెండు వేర్వేరు కమిషన్లు ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపడుతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఏసీబీ, విజిలెన్స్‌, సీఐడీ తదితర నిఘా సంస్థల పరిధిలో నమోదైన కేసులన్నింటిపైనా తెలంగాణ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. అసలీ కేసులు ఎందుకు పెండింగ్‌లో ఉన్నాయి? చర్యలు తీసుకోవడంలో ఎందుకు వెనుకడుగు వేశారు? అనే దానిపై కేసీఆర్‌ ఆరా తీశారు. ఎందుకు ఈ కేసులన్నీ పెండింగ్‌లో ఉన్నాయో అధికారులను ప్రశ్నించారు.

ఏసీబీ, విజిలెన్స్‌, సీఐడీ ఉన్నతాధికారులతో సుదీర్ఘ సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి కేసీఆర్.... టీడీపీ, కాంగ్రెస్‌ ప్రభుత్వాల హయాంలో నమోదైన అవినీతి కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. 1999 నుంచి 2014 వరకూ నమోదై... దర్యాప్తు పెండింగ్‌లో ఉన్న కేసులను సీఎంకు నివేదించారు అధికారులు. ఇలాంటి కేసులు వందల సంఖ్యలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇన్ని కేసులను ఏకకాలంలో దర్యాప్తు జరపాలంటే.... కమిషన్‌ వేయాల్సి ఉంటుందని సీఎంకి నివేదించారు. టీడీపీ హయాంలో నమోదైన కేసులపై ఒక కమిషన్‌‌.... కాంగ్రెస్‌ హయాంలో నమోదైన కేసులపై మరో కమిషన్‌ వేయాలనే నిర్ణయానికి వచ్చినట్లు గెలుస్తోంది.

Similar News