రాజ్యసభలో పాయింట్ ఆఫ్ ఆర్డర్ లేవనెత్తిన విజయసాయిరెడ్డి

Update: 2018-02-08 12:18 GMT

ఈ మధ్య కాలంలో అరుదుగా వినిపిస్తున్న పాయింట్ ఆఫ్ ఆర్డర్ ను వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి రాజ్యసభలో లేవనెత్తారు. టీడీపీ ఎంపీ సుజనాచౌదరి మంత్రివర్గంలో ఉంటూ నిరసన తెలపడంపై విజయసాయి పాయింట్ ఆఫ్ ఆర్డర్ లేవనెత్తారు. కేబినెట్ నిర్ణయంతో విభేదించిన మంత్రిని రాజ్యసభలో ఎలా మాట్లాడనిస్తారని విజయసాయి ప్రశ్నించగా.. కేంద్రమంత్రులు సలహాలు ఇవ్వొచ్చని, సుజనా మాటలు కేబినెట్‌ నిర్ణయానికి వ్యతిరేకం కాదని ఛైర్మన్‌ వెంకయ్యనాయుడు రూలింగ్ ఇచ్చారు. 

చట్టసభల్లో ఈ మధ్య కాలంలో పాయింట్ ఆఫ్ ఆర్డర్ దాదాపు ఓ అరుదైన అంశంగా మారిందని చెప్పుకోవచ్చు. నియమాలకు విరుద్ధంగా ప్రవర్తించే ఏ సభ్యుడి తీరుపై గానీ సభాధ్యక్షుడి దృష్టికి తీసుకెళ్లి.. దాని మీద రూలింగ్ కోరే అవకాశమే పాయింట్ ఆఫ్ ఆర్డర్. ఒకసారి ఓ సభ్యుడు పాయింట్ ఆఫ్ ఆర్డర్ లేవనెత్తాడంటే.. ఆ విషయానికి సంబంధించి లోతుగా పరిశీలించే అవకాశం రాజ్యసభ చైర్మన్ కు ఏర్పడుతుంది. ఆ తరువాత సభాధ్యక్షుడు ఇచ్చే వివరణే రూలింగ్ అవుతుంది. రాజ్యసభలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అదే అంశాన్ని లేవనెత్తారు. విభజన హామీల అమలుపై రాజ్యసభలో తీవ్రమైన గందరగోళం నెలకొన్న సందర్భంలో.. కేంద్ర మంత్రి సుజనా చౌదరి కేబినెట్‌ నిర్ణయానికి విరుద్ధంగా మాట్లాడారంటూ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి పాయింట్‌ ఆఫ్‌ ఆర్డర్‌ లేవనెత్తారు. కేంద్ర మంత్రులకు సమష్టి బాధ్యత ఉంటుందని, కేబినెట్‌లో బడ్జెట్‌కు ఆమోదం తెలిపి సభలో విభేదించడం రాజ్యాంగ విరుద్ధమని ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. సుజనా కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసి కేబినెట్‌ నిర్ణయంతో విభేదించవచ్చని, మంత్రి పదవిలో కొనసాగుతూ కేబినెట్‌ నిర్ణయాన్ని ఎలా వ్యతిరేకిస్తారని ప్రశ్నించారు. అయితే పాయింట్‌ ఆఫ్‌ ఆర్డర్‌పై రాజ్యసభ ఛైర్మన్‌ వెంకయ్యనాయుడు స్పందిస్తూ కేంద్రమంత్రులు సలహాలు ఇవ్వొచ్చని, సుజనా మాటలు కేబినెట్‌ నిర్ణయానికి వ్యతిరేకం కాదంటూ రూలింగ్ ఇచ్చారు. వెంకయ్య రూలింగ్ పై సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేయడం విశేషం. 

 రాజ్యసభలో రూల్ 238 ఆఫ్ 2, 239ఏ కింద పాయింట్ ఆఫ్ ఆర్డర్ లెవనెత్తానని, రాజ్యాంగంలోని ఆర్టికల్ 74,  75 ప్రకారం రాష్ట్రపతి ప్రసంగం మంత్రి వర్గంలో ఆమోదం పొందిన తర్వాత కేంద్ర ప్రభుత్వంలోని కేబినెట్ మినిస్టర్ వ్యతిరేకించడం అంటే బీజేపీ ప్రభుత్వం మీద టీడీపీ మంత్రులు నమ్మకం పోగొట్టుకున్నట్టే అవుతుందని.. విజయసాయి అభిప్రాయపడ్డారు. అభ్యంతరం తెలపాలనుకుంటే మంత్రి పదవికి రాజీనామా చేయాలని విజయసాయి అన్నారు. తాను లేవనెత్తిన పాయింట్‌ ఆఫ్‌ ఆర్డర్‌పై ఛైర్మన్‌ తీరు రాజ్యాంగ విరుద్ధమని.. రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సిన ఛైర్మనే నిబంధనలు అమలు చేయకపోతే ఎలా అని ప్రశ్నించారు. అందుకే ఛైర్మన్‌ తీరుపై రాష్ట్రపతికి ఫిర్యాదు చేస్తామన్నారు విజయసాయి. రాజ్యాంగాన్ని కాపాడే విషయంలో నియమాలు ఎవరు అతిక్రమించినా... వైసీపీ పోరాడుతుందని.. రాజ్యసభలో తనను సస్పెండ్ చేసినా, బహిష్కరించినా.. పోరాటం ఆపేది లేదని విజయసాయి అన్నారు. 

Similar News