వైసీపీ నేత, ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు పై సొంత పార్టీ నేతలే నిప్పులు చెరుగుతున్నారు. ఆయనను నిలువరించండి.. పార్టీ ప్రతిష్ట దెబ్బతీస్తున్నాడు.. మన ఇమేజ్‌ని డ్యామేజ్ చేస్తున్నాడని అధినేత జగన్‌కు ఫిర్యాదుల మీద ఫిర్యాదులు అందుతున్నాయట.
ఇంతకీ అసలు మేటర్ ఏంటంటే…. నాలుగేళ్లుగా ఏపీకి జరుగుతున్న అన్యాయం, తాజా కేంద్ర బడ్జెట్‌తో మరోసారి ప్రూవ్ అయింది. దీనిపై ప్రశ్నించేందుకు టీడీపీ ఎంపీలు ఏకంగా పోరుబాట ఎంచుకున్నారు. అధికారంలో ఉంది తమ మిత్రపక్షమే అయినా వారు బీజేపీపై నిప్పులు చెరుగుతున్నారు. ఓ రకంగా పార్లమెంట్ సాక్షిగా రణం చేస్తున్నారు. ఇంతలా పోరాడుతున్నా… వైసీపీ మాత్రం చేష్టలుడిగి చూస్తోంది. ఆ పార్టీ నేతలు పార్లమెంట్ బయట ప్లకార్డులతో నిరసనలు తెలియజేస్తూ, పార్లమెంట్ లోపల మాత్రం సైలెంట్‌గా ఉంటున్నారు. అక్కడితో ఆగితే పర్లేదు.. పోరాడుతున్న టీడీపీ నేతలపై కంప్లయింట్‌లు చేస్తూ అభాసుపాలవుతున్నారు. ఈ వ్యూహానికి తెరలేపిన ఆ పార్టీ నేత విజయసాయి రెడ్డిపై వైసీపీ నేతలు సీరియస్ అవుతున్నారు. ఏపీకి జరిగిన అన్యాయం-దాని పరిష్కారానికి సూచనలు చేసే అంశంపై చర్చకు రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు అంగీకరించారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి సుజనా చౌదరి లేచి… ఏపీకి జరిగిన అన్యాయాన్ని గుర్తు చేసి, ప్రస్తుతం ఉన్న ప్రతిష్టంభన తొలగాలంటే 15 రోజుల్లో కేంద్రం నుంచి ఏదో ఒక ప్రకటన చేస్తే బావుంటుందని అభిప్రాయపడ్డారు. ఏపీకి జరిగిన అన్యాయంపై సుజనా ఎంత చేస్తున్నదీ, ఏం చేస్తున్నదీ చూస్తూనే ఉన్నాం. ఇటు, మరో కేబినెట్ మంత్రి అరుణ్ జైట్లీ పార్లమెంట్ లాబీలో ఆయన వాగ్యుద్ధం చేశారు. అటు, అమిత్‌షా, రాజ్‌నాధ్ సింగ్, వెంకయ్యనాయుడు వంటి నేతలతో చర్చలు జరుపుతూ ఏపీకి న్యాయం చేయాలని పోరాడుతున్నారు. అలాంటి సుజనా చౌదరిపై పాయింట్ ఆఫ్ ఆర్డర్ లేవదీసిన విజయసాయిరెడ్డి… వితండ వాదం మొదలుపెట్టారు.
కేంద్ర మంత్రివర్గంలో సభ్యుడిగా ఉన్న సుజనా చౌదరి.. బడ్జెట్ ప్రవేశ పెట్టేముందు కేబినెట్ మంత్రిగా దానికి అంగీకారం తెలిపారని, తాజాగా దానిపై అభ్యంతరం తెలపడం అంటే.. అది రాజ్యాంగ విరుద్ధం అని వాదించారు. దానికి రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు సమాధానమిస్తూ…. ఆయన వ్యతిరేకంచడం లేదని, కేవలం సూచనలు మాత్రమే చెబుతున్నారని, అలా చేయడం తప్పుకాదని వివరించారు. అక్కడితో ఆగితే పర్లేదు. పార్లమెంట్ బయటకు వచ్చి సుజనాపై కంప్లయింట్ చేస్తానన్నారు. ఇదే విజయసాయిపై తప్పుడు సంకేతాలు వెళ్లేలాల చేస్తున్నాయి. ఇటు, రాష్ట్రపతిని కలిసిన విజయసాయి రెడ్డి… త్వరలో జరగబోయే రాజ్యసభ ఎన్నికలలో అవకతవకలు జరగనున్నాయని ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలో ఏం జరుగుతోంది..? ఆయన ఏం కోరుకుంటున్నారు…? ఇలా, అర్ధం పర్దం లేని అంశాలను లేవనెత్తుతూ ప్రజలలో నెగిటివ్ భావనను తెచ్చుకుంటున్నారనే అభిప్రాయం వచ్చేసింది.
ఇప్పుడు రాష్ట్రానికి కావల్సింది న్యాయం. జరుగుతున్న అన్యాయంపై యుద్ధం. అది టీడీపీ చేసినా, వైసీపీ చేసినా వారినే ఆశీర్వదిస్తారు ప్రజలు. కానీ, దానిని మరిచి విజయసాయి రెడ్డి చేస్తున్న ఆరోపణలు.. ఆ పార్టీకి వ్యతిరేకంగా మారుతున్నాయి. తప్పుడు సంకేతాలను పంపుతున్నాయి. దీంతో, రాజకీయ పరిజ్ఞానం, అవగాహన లేని ఆయనను ఇకనైనా కాస్త కట్టడి చేయండి అని వైసీపీ అధినేతకు ఫిర్యాదులు వెళుతున్నాయట. ఢిల్లీ సాక్షిగా పార్టీ ఇమేజ్‌ని దెబ్బతీస్తున్నాడని కంప్లయింట్‌లు వెల్లువెత్తుతున్నాయని సమాచారం. మరి, దీనికి జగన్ ఎలాంటి సమాధానం ఇస్తారో చూడాలి.