గవర్నర్ ప్రసంగం సందర్భంగా జరిగిన గలాటాతో.. తెలంగాణ అసెంబ్లీ నుంచి కాంగ్రెస్ సభ్యులు ఊహించని శిక్షను ఎదుర్కొన్నారు. ఉన్న పదమూడు మందిలో.. 11 మందిని సభ నుంచి బడ్జెట్ సెషన్ కు సస్పెండ్ చేసేశారు. మిగతా ఇద్దరు కోమటిరెడ్డి, సంపత్ లను ఏకంగా సభ నుంచే బహిష్కరించారు. టెక్నికల్ గా చెప్పాలంటే.. సభ్యత్వాన్ని రద్దు చేశారు. అక్కడితో అయిపోయిందని అనుకుంటే పొరబాటే.
ఎందుకంటే.. తెలంగాణ శాసనసభలో మొన్న జరిగిన గొడవకు సంబంధించి.. ఇంకా శిక్ష ఖరారు చేయాల్సిన పని బాకీ ఉన్నట్టుగా తెలుస్తోంది. నిన్న ఇద్దరు సభ్యులపై శిక్ష వేసిన తర్వాత.. ఫూటేజ్ ను మరోసారి పరిశీలించారట.. అసెంబ్లీ కార్యాలయ సిబ్బంది. వారితో పాటు.. స్పీకర్ కూడా ఫూటేజ్ పరిశీలించినట్టు తెలుస్తోంది. ఈ సందర్భంగా.. ఇంకో ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు.. దాడి యత్నంలో భాగం పంచుకున్నారని గుర్తించారట.
ఆ ఇద్దరిని కూడా.. సభ్యత్వం రద్దు చేసి బయటికి పూర్తిగా పంపించే అవకాశాలు ఉన్నాయట. ఇంకో విషయం ఏంటంటే.. రెండు సీట్లు ఖాళీ అయినట్టు ఇప్పటికే.. శాసనసభ సచివాలయ వర్గాలు.. కేంద్ర ఎన్నికల సంఘానికీ సమాచారాన్ని అందించాయట. అలాగే.. గజిట్ నోటిఫికేషన్ కూడా వచ్చేసింది. ఇప్పుడు గుసగుసలు వినిపిస్తున్నట్టుగానే మరో రెండు సీట్లు ఖాళీ అయ్యే అవకాశాలు కూడా ఉన్నట్టు.. అసెంబ్లీ వర్గాలైతే.. స్పష్టమైన సమాచారాన్ని ఇస్తున్నాయి.