ఒకవైపు కోర్టు కేసులు మరోవైపు చట్టంలో లొసుగులతో పంచాయతీ ఎన్నికలు ఇప్పట్లో జరిగేలా కనిపించడం లేదు. బీసీ గణన, రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తిచేసినా బీసీ రిజర్వేషన్ల విషయంలో అడ్డంకులు ఎదురయ్యే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు కొత్త పంచాయతీరాజ్ చట్టంలోనూ లోపాలున్నాయనే వాదనలతో గడువులోపు పంచాయతీ ఎన్నికలు జరిగే ఛాన్సే లేదంటున్నారు న్యాయ నిపుణులు.
తెలంగాణలో పంచాయతీ ఎన్నికల ప్రక్రియకు బ్రేక్ పడే అవకాశం కనిపిస్తోంది. బీసీ గణన, రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తిచేసి త్వరలోనే సర్పంచ్ ఎన్నికలు నిర్వహించాలని భావిస్తోన్న ప్రభుత్వానికి కోర్టు కేసులు అడ్డంకిగా మారబోతున్నాయి. పంచాయతీ ఎన్నికల్లోనూ 50శాతానికి మించకుండా రిజర్వేషన్లు పాటించాలని గతంలో సుప్రీంకోర్టు తీర్పునివ్వడం, ఇప్పుడు తాజాగా బీసీ రిజర్వేషన్లపై హైకోర్టులో అనేక కేసులు నమోదై ఉండటంతో అసలు పంచాయతీ ఎన్నికలు ఇప్పట్లో జరుగుతాయా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
సుప్రీం తీర్పు ప్రకారం రిజర్వేషన్లు 50శాతం మించకూడదంటే బీసీలకు 29శాతం మాత్రమే కేటాయించాల్సి ఉంటుంది. అయితే బీసీలకు 34శాతం రిజర్వేషన్లు అమలుకు కేసీఆర్ సర్కార్ నిర్ణయం తీసుకోవడంతో కోర్టు తీర్పులు అడ్డంకిగా మారే అవకాశం కనిపిస్తోంది. కానీ తెలంగాణ పంచాయతీరాజ్ కొత్త చట్టంలో బీసీలకు 34శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని పొందుపర్చినందున కోర్టుల నుంచి ఎలాంటి అడ్డంకులు ఎదురుకావని ప్రభుత్వం భావిస్తోంది.
తెలంగాణ పంచాయతీరాజ్ కొత్త చట్టాన్ని సుప్రీం తీర్పు తర్వాతే రూపొందించినందున మొత్తం రిజర్వేషన్లు 50శాతం దాటొద్దన్న నిబంధన కచ్చితంగా పాటించాల్సిందేనంటున్నారు న్యాయ నిపుణులు. దాంతో గడువులోపు పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తామని ప్రభుత్వం చెబుతున్నా సాంకేతిక అంశాలు, కోర్టు కేసులతో వాయిదా పడే అవకాశం కనిపిస్తోంది.