కాంగ్రెస్‌పై విలీనాస్త్రం..శాసనసభలోనూ విపక్ష హోదాకు గండి కొట్టాలనే..

Update: 2018-12-23 08:32 GMT


తెలంగాణ కాంగ్రెస్ కు దెబ్బ మీద దెబ్బ ఓటమితో కుంగిపోయిన నేతలకు మరో షాక్ తగిలింది. శాసన మండలిని టీఆర్ఎస్ లో విలీనం చేస్తూ మండలి చైర్మన్ బులిటెన్ రిలీజ్ చేశారు. షబ్బీర్ అలీకి ప్రతిపక్ష నేత హోదా రద్దు చేశారు. చైర్మన్ నిర్ణయంపై సోమవారం కాంగ్రెస్ నేతలు హైకోర్టులో పిటిషన్ వేయనున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన కాంగ్రెస్ కు కుదుపు మీద కుదుపులు వస్తున్నాయి. ఓటమి నుంచి తేరుకోకముందే శాసన మండలి లో ఎదురుదెబ్బ తగిలింది. తెలంగాణ శాసనమండలిలో కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష హోదాను కోల్పోయింది. మండలిలో ఇద్దరే సభ్యులు మిగిలి ఉండటంతో హోదాను కోల్పోయినట్లు అధికారిక వెబ్ సైట్ లో అధికారులు వెల్లడించారు. దీంతో షబ్బీర్  అలీకి ప్రతిపక్ష నేత హోదాను కూడా రద్దు చేస్తూ వెబ్ సైట్ లో పేర్కొన్నారు. గతంలో పార్టీ మారిన ఇద్దరు ఎమ్మెల్సీలు ఎం.ఎస్. ప్రభాకర్ , కూచికుళ్ల దామోదర్ రెడ్డితో కలిసి తమను టీఆర్ఎస్ లో విలీనం చేయాలంటూ ఆకుల లలిత, సంతోష్ కుమార్ శుక్రవారం మండలి చైర్మన్ స్వామి గౌడ్ ను కలిసి హస్తం పార్టీకి షాక్ ఇచ్చారు. దీనిపై చైర్మన్ కార్యాలయం అంతే వేగంగా స్పందించింది. సాయంత్రానికల్లా కాంగ్రెస్ మండలి పక్షాన్ని టీఆర్ఎస్ లో విలీనం చేస్తూ బులిటెన్ రిలీజ్ చేశారు. 

కాంగ్రెస్ పక్షాన్ని టీఆర్ఎస్ లో విలీనం చేయడాన్ని హస్తం పార్టీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఫిరాయింపు ఎమ్మెల్సీలపై చర్యలు తీసుకోవాలని స్వయంగా పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, షబ్బీర్ అలీ మండలి చైర్మన్ ను కలిసి కోరినా పట్టించుకోకుండా టీఆర్ఎస్ లో విలీనం చేయడంపై మండిపడుతున్నారు. గతంలో పార్టీ మారిన ఎం.ఎస్. ప్రభాకర్, దామోదర్ రెడ్డిపై వేటు వేయాలని కాంగ్రెస్ కౌన్సిల్ చైర్మన్ కు ఫిర్యాదు చేసింది. ఆ పిటిషన్ ఇంకా చైర్మన్ వద్ద పెండింగ్ లోనే ఉంది. అయితే ఇప్పటికే పార్టీ మారిన ఎమ్మెల్సీలు ఇచ్చిన విజ్నప్తిని పరిగణలోకి తీసుకోవడాన్ని తప్పు పడుతున్నారు. దీనిపై న్యాయ పోరాటం చేయాలని కాంగ్రెస్ నేతలు నిర్ణయించారు. ఇలాంటి పరిణామాలు ఎక్కడ చోటు చేసుకున్నాయి. ఆ సందర్భాల్లో కోర్టు కేసులకు సంబంధించిన వివరాలు సేకరిస్తున్నారు. న్యాయనిపుణులతో కాంగ్రెస్ నేతలు సంప్రదింపులు జరుపుతున్నారు. న్యాయస్థానంలో తమకు తగిన న్యాయం జరుగుతుందనే గట్టి విశ్వాసంతో  ఉన్నారు. సోమవారం కౌన్సిల్ చైర్మన్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ వేసేందుకు కాంగ్రెస్ నేతలు ప్రిపేర్ అవుతున్నారు. తెలంగాణలో టీడీపీకి ఉన్న ఇద్దరు ఎమ్మెల్యేలు పార్టీ మారుతున్నారా.? కారేక్కేందుకు  మార్గం సుగమం చేసుకున్నారా.? సండ్ర వెంకట వీరయ్య, మచ్చా నాగేశ్వరరావు టీఆర్ఎస్ లో చేరుతున్నారనే వదంతులు షికారు చేస్తున్నాయి. అయితే తాను పార్టీ మారడం లేదని నాగేశ్వరరావు తేల్చేశారు. సండ్ర చేరికపై మాత్రం టీఆర్ఎస్ శ్రేణులే వ్యతిరేకిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా శాసనసభ సమావేశాలు జరిగే సమయానికి తెలంగాణలో టీడీపీ పార్టీలో ఎవరూ మిగలరనే ధీమాతో తెరాస వర్గాలున్నాయి. శాసనసభలోనూ అదే వ్యూహానికి టీఆర్ఎస్ బాగానే పదును పెడుతోంది. టీకాంగ్రెస్ ఎమ్మెల్యేలను ఎమ్మెల్యేలను ఆకర్షించడం ద్వారా అసెంబ్లీలోనూ విలీన మంత్రం పఠిస్తోంది.
 

Similar News