సినీ దర్శకుడు రాంగోపాల్‌వర్మపై టీడీపీ నేతలు తీవ్రంగా మండిపడుతున్నారు. లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రంలో ఏపీ సీఎం చంద్రబాబునాయుడిని కుట్రదారునిగా చిత్రీకరిస్తూ పాట విడుదల చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విజయవాడలో రాంగోపాల్‌వర్మ ఫ్లెక్సీలు, ఫోటోలను దగ్ధం చేశారు. రాజకీయ ఒత్తిళ్లతోనే వర్మ.. చంద్రబాబును టార్గెట్ చేశారంటున్నారు.
వర్మకు.. లక్ష్మీపార్వతి మద్దతుగా నిలిచి ఎన్టీఆర్ పరువు తీస్తున్నారని అంటున్నారు. ఎన్టీఆర్ జీవితంలో ఎన్నో ఆదర్శవంతమైన, మరపురాని ఘట్టాలున్నాయని.. వర్మ వాటిని ఎందుకు చూపించడం లేదని ప్రశ్నిస్తున్నారు. రిలీజ్ కాకముందే ఎన్టీఆర్ అభిమానులు ఈ సినిమాను అడ్డుకుంటారని హెచ్చరిస్తున్నారు. కాగా చంద్రబాబు ప్రతిష్టకు భంగం కలిగించేలా సినిమాలో పాట ఉందని ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి కర్నూలు పోలీస్ స్టేషన్‌లో వర్మపై ఫిర్యాదు చేశారు. దీని వెనుక ఎవరెవరు ఉన్నారో వాళ్లందరిపైనా చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు.