ఎన్డీఏ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టిన టీడీపీ అందుకు తగ్గట్లు వ్యూహాలు రచిస్తోంది. అవిశ్వాసానికి మద్దతు కూడగడుతూనే అవిశ్వాసంపై ఓటింగ్ జరిగేలా ప్రణాళికలు వేస్తోంది. టీడీపీ అధినేత చంద్రబాబు ఆ పార్టీ ఎంపీలు కీలక నేతలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. లోక్‌సభలో అవిశ్వాసంపై ఓటింగ్‌కు పట్టుబట్టాలని డివిజన్ అడగాలని సూచించారు. అలాగే ఆరుగురు సభ్యుల టీడీపీ ఎంపీల బృందం ఇవాళ, రేపు ఢిల్లీలో ఉండి అవిశ్వాసానికి మద్దతు కోసం అన్ని పార్టీల నేతలను వ్యక్తిగతంగా కలవాలని ఆదేశించారు.
టీడీపీ అవిశ్వాసానికి అనేక పార్టీలు మద్దతు ఇస్తున్నాయన్న చంద్రబాబు వైసీపీని ఎవరూ నమ్మడంలేదని కామెంట్ చేశారు. అందుకే జగన్ పార్టీ అవిశ్వాసానికి స్పందన రాలేదన్నారు. టీడీపీ అవిశ్వాసం పెట్టిన గంటలోనే చాలా పార్టీలు సానుకూలంగా స్పందించాయనీ జాతీయస్థాయిలో టీడీపీ విశ్వసనీయతకు ఇదే నిదర్శనమని చెప్పారు. జగన్, పవన్ కేంద్రాన్ని ప్రశ్నించకుండా టీడీపీని విమర్శిస్తున్నారనీ తనను బలహీనపరిస్తే ఎవరికి లాభమని చంద్రబాబు ప్రశ్నించారు. బీజేపీ, వైసీపీ, జనసేన పార్టీల మహా కుట్రను ప్రజల్లో బయట పెట్టగలిగామని చంద్రబాబు అన్నారు.