సంచలనం సృష‌్టించిన సుధాకర్ రెడ్డి హత్య కేసును నాగర్ కర్నూలు పోలీసులు వేగవంతం చేశారు. హత్యకేసులో రెండో నిందితురాలు, మృతుని భార్య స్వాతిని నాగర్‌కర్నూల్ జిల్లా పోలీసులు మరోమారు విచారించారు. శనివారం మహబూబ్‌నగర్ జిల్లా జైలు నుంచి ఉదయం 10.30 గంటలకు అదుపులోకి తీసుకొన్న పోలీసులు 11.30 గంటలకు నాగర్‌కర్నూల్ పోలీస్‌స్టేషన్‌కు తీసుకొచ్చారు. ఠాణాలో పోలీసులు సుమారు 5 గంటల పాటు ప్రత్యేక గదిలో విచారించారు. హత్యకు సంబంధించి పోలీసులు స్వాతిపై ప్రశ్నలు సంధించగా ఆమె కొన్నింటికి జవాబిచ్చినట్లు తెలిసింది.
రాజేష్ మాటలు నమ్మే ఈ ఘాతుకానికి తెగించినట్లు స్వాతి చెబుతోంది. అంతేకాక తన భర్తను తానే అన్యాయంగా చంపుకున్నానంటూ స్వాతి పోలీసుల విచారణలో ఏడ్చింది. రాజేష్ మాటలతోనే భర్తను దూరం చేసుకున్నాని కన్నీళ్లతో విలపించింది. అతని మైకంలో ఉండి అతను చెప్పినట్లే చేశానని స్వాతి తెలిపింది. నా భర్తను చంపే ప్లాన్ అతనే వేశాడు... అంతా సినిమాలో మాదిరిగా జరిగిపోతుందని ఇద్దరం భావించినట్లు ఆమె పోలీసులకు తెలిపినట్లు సమాచారం. హత్యకేసుకు సంబంధించిన అదనపు సమాచారం కోసం పోలీసులు నాలుగు రోజులపాటు కోర్టును అనుమతి కోరగా రెండు రోజులు మాత్రమే విచారణకు కోర్టు అనుమతించింది. విచారణ అనంతరం హత్యరోజున స్వాతి ధరించిన దుస్తులు, వినియోగించిన దుస్తులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సుధాకర్‌రెడ్డిని తలపై గట్టిగా రాడ్‌తో కొట్టగా.. గాయానికి వచ్చిన రక్తాన్ని తుడిచిన దుస్తులను స్వాతి ఇంట్లోని బీరువా నుంచి తీసుకొచ్చారు. ఆమెను ఇంటికి తీసుకెళ్లి బీరువాను తెరిపించి అక్కడ దాచిన దుస్తులను తీసుకొచ్చి కోర్టుకు అందజేశారు. అనంతరం స్వాతిని కోర్టు ఎదుట హాజరుపరిచి మహబూబ్‌నగర్ జైలుకు తరలించారు.