తెలంగాణ రాజకీయంలో కొత్త వివాద కేంద్రం అయిన మండలి చైర్మన్ స్వామి గౌడ్.. సరోజినీ దేవి హాస్పిటల్ నుంచి ఇంటికి వెళ్లారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా.. గవర్నర్ ప్రసంగ సమయంలో.. కాంగ్రెస్ సభ్యుడు కోమటిరెడ్డి మైక్ విసరడంతో.. గాయపడి హాస్పిటల్ లో చేరిన స్వామిగౌడ్.. ఇవాల్టికి డిశ్చార్జ్ అయ్యారు. మరో నాలుగు రోజులు కనీసం ఆయన రెస్ట్ తీసుకోవాలని డాక్టర్లు చెప్పారు.
అటు కాంగ్రెస్ నేతలేమో.. ఈ విషయంలో ఇంకా ఆందోళనలు కొనసాగిస్తూనే ఉన్నారు. 48 గంటల పాటు దీక్ష చేసిన కోమటిరెడ్డి, సంపత్ కు.. రాష్ట్ర వ్యాప్తంగా నేతలు సంఘీభావం తెలుపుతూ.. గాంధీ భవన్ కు వెళ్తున్నారు. టీఆర్ఎస్ పై విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. ఇదే సమయంలో.. ఓ విషయం మాత్రం చర్చకు వస్తోంది. టీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్టుగా జరుగుతున్న ఈ గొడవలు బాగానే ఉన్నాయి కానీ.. మధ్యలో జనం సమస్యలపై ఎవరికీ పట్టింపు లేకుండా పోతోందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
చూడ్డానికి చాలా మందికి ఈ గొడవ వినోదం కావొచ్చు.. ఆ రెండు పార్టీలకు రాజకీయ పోరాటం అనుకోవచ్చు. కానీ.. మధ్యలో అధికార, విపక్షాలు ఇలా రెండూ.. జనం సమస్యలు పక్కన పెట్టి.. రాజకీయ స్వార్థం కోసం పరస్పర ఆరోపణలు చేసుకోవడం ఎంత వరకూ సబబని జనం ప్రశ్నిస్తున్నారు. ఈ ప్రశ్నలకు.. టీఆర్ఎస్ నేతలు, కాంగ్రెస్ నేతలు ఏమని బదులిస్తారో.