టీడీపీతో పొత్తును బీజేపీ ఎంతో గౌరవించిందని... వాజ్ పేయి, మోడీలు చంద్రబాబును ఎంతో ఆదరించారని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు తెలిపారు. అయినా, ప్రతిసారీ బీజేపీని టీడీపీ మోసం చేస్తూనే వచ్చిందని అసహనం వ్యక్తం చేశారు. తమ పార్టీ కార్యకర్తలకు ఏమీ చేయలేని స్థితిలో తాము ఉన్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇళ్లు, పెన్షన్లు ఇలా ఏవీ ఇప్పించుకోలేకపోతున్నామని వాపోయారు. కార్యకర్తలకు ముఖం చూపించలేని పరిస్థితి ఉందని చెప్పారు. మిత్రపక్షంగా ఉన్నప్పటికీ, రాష్ట్రంలో తమకు అన్యాయం జరుగుతోందని సోము వీర్రాజు అన్నారు.
ఏపీలో ఇప్పటికే బీజేపీ ఎంతో బలం పుంజుకుందని.... వచ్చే ఎన్నికల్లో అన్ని స్థానాల్లో పోటీ చేసే దిశగా, పార్టీని మరింత బలోపేతం చేస్తున్నామని వీర్రాజు అన్నారు. పొత్తు లేకుండానే గెలిచే సత్తా తమకు ఉందని తెలిపారు. ఇప్పటికే ఎంతో మంది నేతలు బీజేపీలో చేరారని, మరింత మంది చేరేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. 2014లో బీజేపీతో పొత్తు పెట్టుకునే చంద్రబాబు అధికారంలోకి వచ్చారని అన్నారు. కాకినాడ కార్పొరేషన్ లో ఒంటరిగా పోటీ చేసి ఉంటే, 50 సీట్లను కైవసం చేసుకుని ఉండేవారమని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ బలపడిందంటూ ఆ పార్టీ నేతలు చెప్పుకుంటున్నారని... అదే నిజమైతే హిమాచల్ ప్రదేశ్ లో ఎందుకు ఓడిపోయిందని ఎద్దేవా చేశారు.