సిరిసిల్ల మున్సిపల్ ఛైర్ పర్సన్ ఎస్. పావని టీఆర్ఎస్ ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. సిరిసిల్ల అభివృద్ధి కోసం రూ.116.28కోట్ల బడ్జెట్ కు ఆమోదం తెలిపింది. అనంతరం మీడియాతో మాట్లాడిన పావని ..అధికార పార్టీకి చెందిన ఓ మంత్రి తనని లంచాలు తీసుకోమన్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు లంచాలు ఎందుకు ఉపయోగిస్తారో..వారి అవసరాలు ఎలా ఉంటాయో స్పష్టం గా చెప్పడంతో వివాదాస్పద మయ్యాయి. కాంట్రాక్టర్ల నుంచి 1 నుంచి 3శాతం వరకు తీసుకుంటామని అన్నారు. తీసుకున్న మొత్తాన్ని కౌన్సెలర్లకు పంపిణీ చేయాలి. వారికి అవసరాలు ఉంటాయి కదా. ఒక వేళ తాము కమిషన్ తీసుకోకపోతే వారికి ఎక్కడి నుంచి వస్తుంది. ఇలా ఒక్క సిరిసిల్లలోనే కాదు, రాష్ట్రం దేశం మొత్తం ఇలానే జరుగుతుందని నోరు జారారు.
అంతే ఈ వ్యాఖ్యలపై విపక్షాలు టీఆర్ఎస్ పై విమర్శలు చేస్తున్నాయి. కేసీఆర్ తన కుమారుడు కేటీఆర్ ను వచ్చే ఎన్నికల్లో ముఖ్యమంత్రిని చేయాలని టీకాంగ్రెస్ పార్టీ నేతలు ప్రభుత్వం పై దుమ్మెత్తిపోశారు. మంత్రి కేటీఆర్ ను ముఖ్యమంత్రిని చేయాలని..ఎన్నికల కోసం డబ్బులు కావాలి కాబట్టి చైర్మన్ కు కమిషన్ తీసుకోమని చెప్పారని విమర్శిస్తున్నారు.
ఇంతకీ ఆ సదరు మంత్రి ఎవరా అని ఆరా తీసే పనిలో పడ్డారు టీ కాంగ్ నేతలు. మంత్రి పేరు చెప్పకున్నా తెలంగాణ మున్సిపల్, పట్టణాభివృద్ధి మంత్రిగా ఉన్న కేటీఆర్‌ను ఉద్దేశించి చేసినవేనని కాంగ్రెస్, బీజేపీ నాయకులు ఆరోపిస్తున్నారు. అయితే అటు మున్సిపల్ ఛైర్‌పర్సన్ చేసిన వ్యాఖ్యలపైగాని, ఇటు విపక్షాల సంధిస్తున్న విమర్శనాస్త్రాలపైగాని ప్రభుత్వం గానీ, టీఆర్‌ఎస్ పార్టీగానీ ఇప్పటి వరకు స్పందించలేదు. మరోవైపు మంత్రిపై వ్యాఖ్యలు చేసిన వ్యాఖ్యలపై చైర్ పర్సన్ పదవికి పావని రాజీనామా చేశారు. తనకు ఇంతకాలం సహకరించిన మంత్రి కేటీఆర్‌కు, సహచర మునిసిపల్ కౌన్సిలర్లకు ధన్యవాదాలు తెలియజేస్తున్నట్టు ఆమె తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు. అయితే ఆమె రాజీనామా వెనుక అధికార పార్టీ నుంచి తీవ్ర ఒత్తిడి ఉన్నట్లు విపక్ష పార్టీల నేతలు ఆరోపిస్తున్నారు.