తూర్పు గోదావరి జిల్లా వీరవరపులంక వద్ద పడవలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. గోదావరిలో పాపికొండలు యాత్రకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. పోశమ్మగండి నుండి బయల్దేరిన10 నిమిషాలకే పడవలో మంటలు చేలరేగాయి. ప్రమాదం సమయంలో పడవలో 120 మంది ప్రయాణికులు ఉన్నారు. ప్రమాదాన్ని గుర్తించి, వెంటనే అప్రమత్తమైన అధికారులు.. ప్రయాణీకులను వెరే పడవలో పంపడంతో పెద్ద ముప్పు తప్పింది.
గోదావరిలో పాపికొండలు యాత్రకు బయలుదేరిన ఓ పడవలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఆ మంటలు క్రమంగా బోటు మొత్తం వ్యాపించాయి. పోశమ్మగుడి నుంచి పడవ బయల్దేరిన 10 నిమిషాలకే ఈ ఘటన చోటు చేసుకుంది. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో బోటులో ఉన్న ప్రయాణీకులంతా ఆందోళనకు గురయ్యారు. ప్రమాదం గురించి తెలుసుకున్న వీరవరపులంక గ్రామస్తులు నదిలో ఈదుకుంటూ వెళ్లి.. ముందు 40 మంది ప్రయాణికులను సురక్షితంగా ఒడ్డుకు తీసుకువచ్చారు.
పడవ ప్రమాదం గురించి సమాచారమందుకున్న పోలీసులు, అధికారులు.. వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నారు. స్థానికుల సాయంతో మిగతావారిని కూడా గోదావరిన నుంచి సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. భారీగా ఎగసిపడిన మంటల ధాటికి పడవ పూర్తిగా దగ్ధమైంది. ఈ ఘటనలో పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. పర్యాటక బోటులోని జనరేటర్‌లో షార్ట్‌సర్క్యూట్ జరగడంతోనే.. మంటలు చెలరేగినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనపై పూర్తిస్థాయి దర్యాప్తు చేపట్టారు.