వారంతా నేటి సమాజపు దుస్థితికి అద్దం పడుతున్న ఆనవాళ్లు. విరిసీ, విరియని మొగ్గలు. పూవుల్లాంటి ఆడపిల్లలు కామాంధుల పాలిట బలి పశువుల్లా మారుతున్నారు. నిండు నూరేళ్ల జీవితాన్ని నిర్దాక్షణ్యంగా కోల్పోతున్నారు.
వావీ వరసలు, చిన్నా పెద్దా తేడా లేకుండా మగాళ్ల రూపంలో వికృతంగా ప్రవర్తిస్తున్న మృగాళ్లు... అన్యాయంగా అమాయకుల్ని బలి తీసుకుంటున్నారు. ఈ మగాళ్లలో అసలేంటీ ఈ విపరీత ధోరణి... విచిత్ర ప్రవర్తన? సైకాలజికల్ డిజార్డరా?
ఆడపిల్లలు, పసిపిల్లలపై జరుగుతున్న అన్యాయాలు ఇన్నీ అన్నీ కావు. బతుకుపోరాటంలో వారి సమిధలుగా మార్చేస్తున్న ఘటనలు ఎన్నో. ఇన్ని అపశృతుల మధ్య జీవితమనే మహానదిని దాటడమే వారికి గగనమైపోవడమే విషాదకరం. బాల్యం బావురుమంటోంది.. విరిసీ విరియని పూవులు రెక్కలూడి రాలిపోతున్నాయి. ఎక్కడ చూసినా ఇదే తంతు.. ఇంకా పెద్ద వయసుకు రాని, పసితనం వీడని అమాయకపు పిల్లలను లోబరచుకుని వారిపై లైంగిక వాంఛలు తీర్చుకునే కామాంధులకు అంతం లేకుండాపోతోంది.
అక్కడా ఇక్కడా కాదు. దేశవ్యామంతటా ఇదే. రోజూ ఇలాంటిది ఏదో ఒక వార్తే. కేవలం ఒకట్రెండు రోజుల వ్యవధిలోనే అమాయకుల అరణ్య రోదనలు తెలంగాణ రాష్ట్రంలోనే వినిపించాయి. కనిపించాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఏడేళ్ల బాలికపై కన్నేసిన ఓ కామాంధుడు ఆ అమాయకురాలి పుట్టినరోజు నాడే చిదిమేశాడు. గోరికొత్తపల్లిలో రేష్మ అనే చిన్నారి పెళ్లి ఊరేగింపు చూడ్డానికి వెళ్లి ఆ కామాంధుడి చెరలో చిక్కింది. పాపం ఆ చిన్నారిపై పశువాంఛ తీర్చుకోవడమే కాకుండా ఆ చిన్నదాని ప్రాణం తీయడం ఆ మృగాడి వికృతావతారానికి నిదర్శనం.
అంతెందుకు మొన్నటికి మొన్న తూప్రాన్‌లో మరీ దారుణం. రాత్రయింది. తానున్నది హైవేపే. అటు ఇటు ఎటూ చూసినా చీకటే. ఆ చీకటి తెరలను చీల్చుకుంటూ వస్తున్న డీసీఎంని లిఫ్ట్ అడిగింది ఆ అభాగ్యరాలు. వ్యాన్ ఎక్కించుకున్నాక డ్రైవర్‌లో దాగి ఉన్న మృగాడు నిద్ర లేచాడు. వ్యాన్‌లోనే చెరపట్టపోయాడు. అయ్యా తాను ఐదేళ్ల గర్భవతిని అంటూ ఆమె వేడుకున్నా కనికరించలేదు. తప్పించుకునే ప్రయత్నంలో భాగంగా వ్యాన్‌లోంచి దూకింది. తలపగిలి చచ్చిపోయింది.
ఈ ఘటనలను ఎలా చూడాలి. ఈ మృగాళ్ల వికృతాన్ని ఎలా ఎండగట్టాలి. సమాజంలో అసమానతలు, సామాజిక జాడ్యాలు తెలియనివేం కావు.. చట్టాలెన్ని వున్నా అవి పకడ్బందీగా అమలు జరగనపుడే సమాజంలో మార్పు రాదు.. మహిళలు, ఆడపిల్లలను వేధించే కిరాతకులకు చట్టంలో లొసుగులే అండగా వున్నపుడు ఇక సమాజంలో మార్పు వస్తుందని ఎలా ఆశించగలం? ఇలాంటి ఇన్సిడెంట్స్‌ని కేవలం నేర కోణం నుంచి చూస్తే సమస్య పరిష్కారం కాదు. ఇరుకు మనసుతో ఆలోచించే మగాళ్లు సారీ మృగాళ్ల మెదళ్లను విశాలం చేయాలి.