పశ్చిమ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తుపానుగా మారి బుధవారం మధ్యాహ్నం ఉత్తర వాయవ్య దిశగా పయనిస్తూ తీవ్ర తుపానుగా మారింది. గంటకు 11 కిలోమీటర్ల వేగంతో ఈ తుఫాను సముద్రంలో కదులుతోంది. రాత్రి 11.30 గంటల సమయానికి కళింగపట్నానికి ఆగ్నేయంగా 130 కి.మీ., ఒడిశాలోని గోపాల్‌పూర్‌కు దక్షిణ ఆగ్నేయంగా 180 కిలోమీటర్ల దూరంలో ఇది కేంద్రీకృత మైంది. ఈ విషయాన్నీ వాతావరణ శాఖ అధికారులు స్పష్టం చేశారు. ఈ టిట్లీ తుఫాను మరింత బలపడి పెను తుపానుగా మారుతుందని వాతావరణశాఖ అంటోంది. గురువారం ఉదయం కళింగపట్నం– గోపాల్‌పూర్ మధ్య తుపాను తీరం దాటుతుందని భారత వాతావరణ విభాగం తెలపగా తీరం దాటే సమయాల్లో బలమైన ఈదురుగాలులతో భారీ వర్షం కురుస్తుందని.. ఇప్పటికే శ్రీకాకుళం జిల్లాలో భారీగా వర్షం కురుస్తుందని చెప్పింది. కాగా ఉత్తరాంధ్ర, ఒడిశాల్లో రెడ్ అలెర్ట్ ప్రకటించగా.. పలు రైళ్ల రాకపోకలు రద్దయ్యాయి. మత్సకారులు సముద్రంలో వేటకు వెళ్లోద్దని వాతావరణ శాఖ సూచిస్తోంది. అంతేకాదు తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.