‘రైతుబంధు’ చెక్కులొచ్చాయ్‌..!

Update: 2018-04-17 08:11 GMT

సంక్షోభ సేద్యాన్ని, లాభాల బాట పట్టించేందుకు కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిన ప్రతిష్టాత్మక పథకం రైతు బంధు. రైతుల పెట్టుబడి కష్టాలను తీరుస్తుందని సర్కారు గట్టి నమ్మకంతో ఉంది. చెక్కుల పంపిణీకి సర్వం సిద్దం చేసిన ప్రభుత్వం, వచ్చే నెల రెండోవారంలో పథకాన్ని పట్టాలెక్కించబోతోందని తెలుస్తోంది. అన్నదాతలను ఆత్మహత్యల నుంచి బయటపడేయటంతో పాటు వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు, తెలంగాణ ప్రభుత్వం వినూత్న పథకాలకు శ్రీకారం చుట్టింది. అందులో భాగంగానే, కేసీఆర్ సర్కారు, పెట్టుబడి సాయం పథకాన్ని ఈ ఖరీఫ్‌ నుంచే పట్టాలెక్కించబోతోంది. 

సాలీనా ఎకరానికి 8 వేల అందించే ఈ పథకం, ఇప్పటికే దేశవ్యాప్తంగా అనేక ప్రశంసలు అందుకుంది. ఖరీఫ్‌కు ఎకరానికి 4 వేలు, రబీకీ మరో 4 వేల చొప్పున ఏడాదికి 8,000 వేలు అందించే ఈ స్కీమును, కేసీఆర్ సర్కారు ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. రాష్ట్రంలోని 72 లక్షల మంది రైతులకు,  ఈ పంట సాయం అందించేందుకు రంగం సిద్దం చేస్తోంది. మూడు విడతల్లో చెక్కుల పంపిణీ పూర్తి చెయ్యాలని సంకల్పించుకుంది. ఇప్పటికే యాభై ఐదు లక్షల చెక్కుల్లో ముప్పై లక్షల చెక్కుల ముద్రణ కూడా పూర్తైంది. 

పెట్టుబడి సాయానికి రైతుబంధు పథకంగా పేరు పెట్టింది కేసీఆర్ ప్రభుత్వం. అవసరమైన నిధుల కోసం, ఏడు వేల కోట్ల అప్పులు కూడా తీసుకుంది. నగదు కొరత రావొద్దని రిజర్వ్ బ్యాంకుతోనూ మాట్లాడారు. ప్రభుత్వ విజ్ణప్తి మేరకు రిజర్వ్ బ్యాంకు రెండు వేల కోట్ల నగదును ఇప్పటికే ప్రత్యేక విమానాల ద్వారా రాష్ట్రానికి పంపింది. 

మరోవైపు భూమికి సంబంధించి సరైన పత్రాల్లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే భూములన్నింటికి ప్యూరిఫికేషన్ పూర్తియ్యింది. దీంతో రైతులుకు వారి భూముల వివరాలన్నింటినీ పకడ్బందీగా ఉండే, కొత్త పాస్ పుస్తకాలు రూపొందిస్తోంది ప్రభుత్వం. ఇందుకోసం దేశంలో మరెక్కడాలేని విధంగా, సమగ్ర భూ రికార్డుల ప్రక్షాళన చేపట్టింది. ఈ వివరాలతో కూడిన పాస్ పుస్తకాలను కొత్తగా ప్రింట్ చేసింది. ఈ కొత్త పాస్ పుస్తకాలకు కోర్ బ్యాంకింగ్ తరహాలో ల్యాండ్ వెబ్ సైట్ నిర్వహిస్తోంది. దీనికి ‘ధరణి’ అనే పేరును ఖరారు చేశారు సిఎం కేసీఆర్. అవినీతికి ఏమాత్రం ఆస్కారం లేని పారదర్శకమైన కొత్త రిజిస్ట్రేషన్ విధానమని ప్రభుత్వం చెబుతోంది. 

ఎటువంటి వివాదాలూలేని భూముల వివరాలకు సంబందించిన, పట్టాదారు పాస్ పుస్తకాలను రైతులకు అందించబోతోంది ప్రభుత్వం. రైతులకు తన భూమిఎంత ఉందో దాన్ని బట్టి రైతు బంధు పథకం ద్వారా పెట్టుబడి సాయం ఇవ్వాలని, అప్పడే నిజమైన లబ్డిదారులు, రైతులకు ఉపయోగపడుతుందని భావిస్తోంది. ఈ రెండు కార్యక్రమాలను ఒకేసారి అమలు చెయ్యాలని ప్రభుత్వం అనుకుంటోంది. ఈ నెల 20 నుంచి రైతు బందు పథకం ప్రారంభించాలని అనుకున్నా, ప్రింటింగ్, సాంకేతిక సమస్యలతో దాన్ని వచ్చే నెల రెండోవారంలో ప్రారంభించాలని సిఎం కేసీఆర్ తాజాగా నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. 

Similar News