హీరో ప్రభాస్ భూమి వివాదం కేసులో తెలంగాణ రెవెన్యూ శాఖ అధికారులుహైకోర్టులో కౌంటర్ దాఖలు చేశారు. రంగారెడ్డి జిల్లా రాయ్‌దుర్గం పాన్ మక్త గ్రామంలోని ప్రభాస్ గెస్ట్ హౌజ్ ను ఎందుకు స్వాధీనం చేసుకోవాల్సి వచ్చిందో కౌంటర్‌లో వివరించారు. ప్రభాస్ భూమిని చట్టబద్ధంగా కొనుగోలు చేశారని, సీజ్ చేసిన స్థలాన్ని తిరిగి అప్పగించాలని ప్రభాస్ తరపు అడ్వకేట్ కోర్టును కోరారు. ప్రముఖ హీరో ప్రభాస్ భూమి వివాదం కేసును మరోసారి హైకోర్టు విచారించింది. తెలంగాణ రెవెన్యూ శాఖ అధికారులు కౌంటర్ దాఖలు చేశారు. ప్రభాస్ తరపు అడ్వకేట్, తెలంగాణ ప్రభుత్వ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. 2005లో రాయ్‌దుర్గం పన్మక్త గ్రామంలోని సర్వే నంబర్ 5/3లో 2,083 చదరపు అడగుల స్థలాన్ని ప్రభాస్ కొనుగోలు చేశారని అతడి తరపు అడ్వకేట్ కోర్టుకు వివరించారు. క్రమం తప్పకుండా ఆస్తి పన్ను, విద్యుత్ బిల్లులు చెల్లించడమే కాకుండా క్రమబద్ధీకరణ కోసం కోటి ఐదు లక్షల రూపాయల ఫీజు చెల్లించారని తెలిపారు.
ప్రభాస్ స్థలంలోకి అకస్మాత్తుగా రెవెన్యూ అధికారులు వచ్చి ఇది ప్రభుత్వ భూమి అని, ఇందుకు సుప్రీంకోర్టు తీర్పును ఆధారంగా చూపారని ప్రభాస్ తరపు అడ్వకేట్ కోర్టుకు తెలిపారు. పిటిషనర్ వాదనలు వినడం గానీ, నోటీసు ఇవ్వడం గానీ చేయలేదన్నారు. సీజ్ చేసిన స్థలాన్ని తిరిగి ఇచ్చేలా ఆదేశాలు ఇవ్వాలని ప్రభాస్ తరపు న్యాయవాది కోరారు. ప్రభాస్ భూ వివాదం కేసును విచారణను ఈ నెల 31వ తేదీకి వాయిదా వేసింది హై కోర్టు. తదుపరి విచారణలో న్యాయస్థానం ఎలాంటి ఆదేశాలు జారీ చేస్తుందనే అనే దానిపై ఉత్కంఠ నెలకొంది.