ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలనే డిమాండ్‌తో రాజకీయపార్టీలు పలు రకాల ఆందోళన కార్యక్రమాలకు పిలుపునిచ్చాయి. ఏప్రిల్ 6న, రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ సైకిల్ ర్యాలీలు చేపట్టాలని నిర్ణయం తీసుకొంది. రాజధానిలో సైకిల్ ర్యాలీని చంద్రబాబునాయుడు ప్రారంభిస్తారు. టీడీపీ ప్రజా ప్రతినిధులంతా అసెంబ్లీకి సైకిల్ ర్యాలీ ద్వారా రానున్నారు. జనసేన,సీపీఐ,సీపీఎంలు ఏప్రిల్ 6న, రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్రలు నిర్వహిస్తారు. పాదయాత్రలో పవన్ కల్యాణ్, సీపీఎం మధు, సీపీఐ రామకృష్ణ పాల్గొననున్నారు. రామవరప్పాడు వరకు యాత్ర కొనసాగనుంది. అదే విధంగా విభజన హామీలు నెరవేర్చాలని తెలంగాణలోనూ జనసేన ఆందోళనలు చేపట్టనున్నారు. రేపు రాష్ట్ర రహదారులపై కార్యకర్తలు పాదయాత్ర చేయాలని నిర్ణయం తీసుకున్నారు.. వైసీపీ ఎంపీలు ఏపీ భవన్‌లో దీక్షలకు మద్దతుగా రాష్ట్ర వ్యాప్తంగా దీక్షలు చేయాలని వైసీపీ పిలుపునిచ్చింది.
ఇదిలా ఉంటే రాష్ట్రంలో విపక్షాలను ఇరుకున పెట్టేలా టిడిపి వ్యూహరచన చేసింది. ఏప్రిల్ 7న, ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశానికి రావాలని మంత్రులను విపక్షపార్టీల నేతల వద్దకు పంపాలని చంద్రబాబునాయుడు నిర్ణయం తీసుకొన్నారు. గత అఖిలపక్ష సమావేశానికి హజరుకాని మూడు పార్టీల నేతల వద్దకు మంత్రులను పంపి ఆల్ పార్టీ మీటింగ్‌కు రావాలని బాబు సమాచారాన్ని పంపనున్నారు. ఏప్రిల్ 6న, మంత్రులు ఈ మూడు పార్టీల నేతలను ప్రత్యేకంగా కలిసి ఆహ్వనించనున్నారు.అయితే గతంలో నిర్వహించిన అఖిలపక్ష సమావేశానికి హజరుకాని ఈ మూడు పార్టీలు ఈ సమావేశానికి హజరౌతాయా లేదా అనేది స్పష్టత రావాల్సి ఉంది.
ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలనే డిమాండ్ తో వైసీపీ ఎంపీలు రాజీనామాలతో పాటు ఆమరణ దీక్షలకు దిగనున్నారు. జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ కూడ ఆమరణ దీక్షకు దిగుతానని ప్రకటించారు. ఎంపీల రాజీనామాల విషయమై టీడీపీ సానుకూలంగా ఉన్నట్టు సంకేతాలు ఇవ్వలేదు. అయితే పార్లమెంట్ వాయిదా పడిన తర్వాత ఎంపీలతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించి భవిష్యత్ కార్యాచరణను చంద్రబాబునాయుడు ప్రకటించనున్నారు. అంతేకాదు రాష్ట్ర వ్యాప్తంగా ఆత్మగౌరవ బస్సు యాత్ర చేయాలని నిర్ణయం తీసుకొన్నారు. జిల్లాల్లో బహిరంగ సభలు నిర్వహించాలని ప్లాన్ చేశారు.