తెలంగాణ పర్యటనలో ఉన్న పవన్ కల్యాణ్ కు టీఆర్ఎస్ హెల్ప్ చేస్తుందా అంటే అవుననే అంటున్నారు టీకాంగ్ నేతలు. సోమవారం జగిత్యాల జిల్లా కొండగట్టులో పూజలు చేసి యాత్ర ప్రారంభించిన పవన్ పార్టీ కార్యకర్తలు - అభిమానులతో భేటీ అయ్యారు. భేటీ అనంతరం కరీంనగర్ లోని టీఆర్ఎస్ ఎమ్మెల్యేకి చెందిన హోటల్ లో బసచేసినట్లు సమాచారం. పవన్ ఆ హోటల్లో బస చేయడంపై స్థానిక కాంగ్రెస్ నేతలు విమర్శిస్తున్నారు.
అసలే కాంగ్రెస్ నేతలు పవన్ కల్యాణ్ తెలంగాణ పర్యటనపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు.పవన్ తెలంగాణ వ్యతిరేకి.. టిఆర్‌ఎస్‌తో రహస్య అవగాహన వుండటం వల్లనే పవన్ ఇక్కడ ప్రవేశిస్తున్నారని కాంగ్రెస్ మాజీ ఎంపి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. అంతేకాదు తెలంగాణ పొలిటికల్ జేఏసీ ఛైర్మన్ కోదండరాం పర్యటనకు పర్మిషన్ ఇవ్వని ప్రభుత్వం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ పర్యటనకు ఏ విధంగా అనుమతి ఇచ్చారో చెప్పాలని టీ కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. కేసీఆర్‌కు పవన్‌కు మధ్య చీకటి ఒప్పందం జరిగిందని అన్నారు.
ఇదిలా ఉంటే పర్యటనలో ఉన్న పవన్ కరీంనగర్ లో పవన్ హోటల్ శ్వేతాలో బస చేస్తున్నారు. ఆ హోటల్ యజమాని టీఆరెస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్. టీఆరెస్ ఎమ్మెల్యేకు చెందిన హోటల్ లో జనసేన అధినేత బస చేయడం కాకతాళీయమే కావొచ్చు కానీ. పవన్ టీఆర్ఎస్ పార్టీ కి చెందిన ఎమ్మెల్యే హోటల్ లో బస చేయడంపై టీఆర్ఎస్ - జనసేన బంధంపై ఉన్న అనుమానాలకు మరింత బలం చేకూరినట్లైంది. దీంతో పవన్ పర్యటనలకు టీఆరెస్ ఏర్పాట్లు చేస్తోందన్న విమర్శలు స్థానికంగా వినిపిస్తున్నాయి.