జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను ఇరుకున పెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయా. గడిగడికో మాట్లాడుతున్నారంటూ అధికార పార్టీ నేతలు మండిపడుతుంటే..వామపక్షాలు తలలు పట్టుకుంటున్నాయి. గత నాలుగేళ్లుగా టీడీపీ తో స్నేహం చేసిన పవన్ ఒక్కసారిగా స్టాండ్ మార్చేఅదే పార్టీపై విమర్శలు చేయడంపై మతలబు ఏంటీ..?ప‌్రశ్నించడానికో పార్టీ అంటున్న పవన్ అధికార పార్టీ పై విమర్శలు చేస్తూ తనని తాను కార్నర్ చేసే ప్రయత్నం చేస్తున్నారా..? అంటే అవుననే అంటున్నారు పలువురు నెటిజన్లు
జనసేన పార్టీ ఆవిర్భావం సందర్భంగా గుంటూరులో ఏర్పాటు చేసిన సభలో టీడీపీ పై పవన్ విమర్శలు చేశారు. అప్పటి నుంచి ప్రారంభమైన విమర్శల పర్వం కొనసాగుతూనే ఉంది. ప్రభుత్వం పై విమర్శలు చేస్తూ ఎన్డీఏ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని డిమాండ్ చేయడంతో పవన్ ఒక్కసారిగా నేషనల్ మీడియాలో ఆకర్షించారు.
ఈనేపథ్యంలో జనసేనానిపై పలు ప్రశ్నలు సంధించింది నేషనల్ మీడియా. అయితే ఆ ప్రశ్నలపై మాట్లాడే సమయంలో ఏపీ లో అవినీతి, తెలంగాణ సీఎం కేసీఆర్ కు , ఏపీ సీఎం చంద్రబాబుకు ఎన్నిమార్కులు , ఏపీలో జరుగుతున్న అవినీతి గురించి తనతో టీడీపీ నేతలు చెప్పారంటూ పలు సంచలన వ్యాఖ్యలు చేశారు.
అంతవరకు పవన్ అభిప్రాయం బాగున్నా ఏపీకి ప్రత్యేకహోదా అంశంపై మాట్లాడిన తీరుపై పలువురు మండిపడుతున్నారు. నాడు ఏపీకి ప్రత్యేకహోదా కావాలని డిమాండ్ చేసిన పవన్ నేషనల్ మీడియాతో మాట్లాడుతూ ఏపీకి ప్రత్యేకహోదా అంశంపెద్ద విషయం కాదని , కేంద్రం నుంచి నిధులు రావడమే గొప్పవిషయమంటూ చెప్పుకొచ్చారు.
ఈ వ్యాఖ్యల్ని అస్త్రంగా చేసుకున్న ఏపీ ప్రభుత్వం విమర్శలు చేస్తుంటే ..పవన్ తో కలిసి పనిచేసేందుకు ఉవ్విళ్లూరుతున్న వామపక్షాలు తలలు పట్టుకుంటున్నాయి. ప్రత్యేకహోదాపై స్పష్టమైన ప్రకటన చేసిన పవన్ ..ఇలా మాట్లాడడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఇదే అదునుగా భావించిన టీడీపీ అభిమానులు సోషల్ మీడియాలో విమర్శలు చేస్తున్నారు.
దీంతో షాక్ తిన్న జనసేన వివరణిచ్చింది. తన మాటల్ని వక్రీకరించారని, ఇప్పటికీ తాను ఏపీకి ప్రత్యేకహోదాకు కట్టుబడిఉన్నామంటూ చెప్పుకొచ్చింది. లేదంటే టీడీపీ ఆరోపిస్తున్నట్టు మోడీ వ్యూహంలో పవన్ కల్యాణ్ భాగమని మరింత గట్టిగా ప్రచారం చేసేవారు. కేంద్రం హోదాకు వ్యతిరేకంగా ఉన్నవేళ.. పవన్ వారికి పరోక్షంగా లాభం చేకూర్చేలా వ్యాఖ్యలు చేశారని ఆరోపించేవారు.
ఎక్కడ ఏ చిన్న తప్పు దొరికినా.. తప్పుడు ఆరోపణలు చేసినా పవన్ పరువు తీయడానికి ప్రత్యర్థులు కాచుకు కూర్చున్నారు. కాబట్టి పవన్ కల్యాణ్ మరింత అప్రమత్తంగా ఉండాలని జనసేన శ్రేణులు కూడా భావిస్తున్నాయట.