కథువాలో ఎనిమిదేళ్ల బాలికపై జరిగిన సామూహిక అత్యాచారం, హత్య తనను ఎంతో కలచివేసిందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. కథువా ఘటనకు నిరసనగా హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులోని ఇందిరా గాంధీ విగ్రహం దగ్గర మౌన దీక్ష చేపట్టారు. మన దేశంలో కథువా ఘటనే మొదటిది కాదని ఏదైనా దారుణం జరిగితే కానీ మనలో చలనం రావడం లేదని చెప్పారు. ఢిల్లీలో అత్యాచార ఘటన జరిగిన తర్వాతే నిర్భయ చట్టం వచ్చిందని తెలిపారు. కళ్ల ముందు జరిగితే కానీ ఎంపీలు స్పందించరా అని అసహనం వ్యక్తం చేశారు. ఆడపిల్లల్ని వేధించేవారిని, అత్యాచారానికి ఒడిగట్టేవారిని బహిరంగంగా శిక్షించాలని... అప్పుడే అందర్లో భయం పుడుతుందని అన్నారు. సింగపూర్ తరహాలో శిక్షలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. పశువులకు కూడా ప్రకృతి నియమం ఉంటుందని మానవ మృగాలకు ఎలాంటి నియమాలు లేకుండా పోయాయని పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.