చిత్తూరు జిల్లా శెట్టిపల్లిలో జనసేన అధినేత పవన్‌కల్యాణ్ పర్యటించబోతున్నారు. భూ సేకరణను వ్యతిరేకిస్తున్న రైతులకు అండగా అక్కడికి వెళ్తున్నారు. శెట్టిపల్లి భూముల బాధితుల తరపున తన స్వరం వినిపించబోతున్నారు. పలన్ టూర్ చిత్తూరు జిల్లాలో హీట్ పెంచుతోంది. తిరుపతి అర్బన్ మండలం పరిధిలోని శెట్టి పల్లి పంచాయితీలో 650 ఎకరాల భూమిపై పోరు సాగుతోంది. స్వాతంత్ర్యానికి పూర్వం నుంచి ఈ భూమిని రైతులు సాగు చేసుకుంటున్నారు. కానీ పట్టాలు లేవు. గతంలో రైల్వే క్యారేజ్ రిపేర్ షాపు స్థాపన కోసం ప్రభుత్వం 100 ఎకరాల భూమిని తీసుకుంది. ఇప్పుడు పరిశ్రమల స్థాపన కోసం మరో 500 ఎకరాలు సేకరించాలని నిర్ణయించి సర్వే కూడా పూర్తి చేసింది. భూ సేకరణ తీవ్రంగా వ్యతిరేకిస్తున్న రైతులు గతంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను ఆశ్రయించారు.
తిరుపతి శరవేగంగా అభివృద్ది చెందుతుండడంతో శెట్టిపల్లిలో కొంత మంది తమ భూములను ప్లాట్లుగా మార్చి విక్రయించేశారు. 200 ఎకరాల్లో ప్లాట్లు ఉన్నాయి. 220 ఎకరాల్లో చిన్నకారు, సన్నకారు రైతులు వ్యవసాయం చేసుకుంటున్నారు. మరో 50 ఎకరాల్లో చెరువు వుంది. తమ భూములను ప్రభుత్వం సేకరిస్తే తమకు ఆతధారమేమిటాని రైతులు ప్రశ్నిస్తున్నారు. గత ఎన్నికల సందర్భంగా శెట్టిపల్లి రైతులకు పట్టాలు ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చి ఇప్పుడు విరుద్ధంగా ప్రవర్తించడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
శెట్టిపల్లిలోని భూములు ప్రభుత్వ భూములేనని, ఎవరు ఎన్ని విధాలా అనుభవిస్తున్నా వాటిపై హక్కులు తమవేనని ప్రభుత్వం వాదిస్తోంది. భూ సేకరణను వ్యతిరేకిస్తున్న శెట్టిపల్లివాసులతో అధికారులు మూడు దఫాలు జరిపిన చర్చలు విఫలమయ్యాయి. ప్లాట్ల యాజమానులు నష్టపోకుండా ఉండేందుకు నష‌్టపరిహారం ఇస్తామని అధికారులు ప్రతిపాదించారు. అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారంతో భూసేకరణ చేపడుతామంటున్నారు. ఈ వివాదం జనసేన అధినేత పవన్ కల్యాణ్ చెంతకు చేరకడం.. బాధితులకు అండగా ఉంటానని ఆయన హామీ ఇచ్చిన నేపథ్యంలో జనసేనాని శెట్టిపల్లి పర్యటనకు రెడీ అయ్యారు. పవన్ టూర్ పై శెట్టిపల్లి వాసులతో పాటు రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.