ఎద్దు అనగానే ముందుగా గుర్తుకొచ్చేది ఒంగోలు గిత్త. ఆ సొగసు చూసేందుకు రెండు కళ్లూ చాలవు. పర్వత శిఖరాన్నే ధిక్కరిస్తున్నట్టుండే మూపురం, లయబద్ధంగా కదిలే గంగడోలు, కొనలు తేరిన కొస కొమ్ములు, కొండలనైనా పెకలించే బలం. ఆత్మవిశ్వాసానికి నిలువెత్తు రూపంగా కదిలి వస్తుంటే... నడకలో రాజసం, నడతలో నమ్రత. కాలు దువ్వి రంకె వేసిందో గుండెలు గుభేల్‌మనాల్సిందే. కొదమ సింహాన్నైనా క్షణాల్లో మట్టి కరిపించే కండబలం.. పుట్టకలోనే పుట్టుకొచ్చిన పౌరుషం... ఈ ఉపమానాల కలబోతే మన ఒంగోలు గిత్త. తెలుగు నేల ఖ్యాతిని ఖండాతరాలకు వ్యాపింపజేసిన ఈ జగజ్జేత ఒంగోలు గిత్త ఇప్పుడు ప్రమాదంలో పడింది. ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగా ఈ జాతి అంతరించిపోతోంది. నానాటికి ఉనికిని కోల్పోతున్న ఒంగోలు గిత్తలపై హెచ్ఎంటీవీ స్పెషల్ స్టోరీ.
ప్రపంచంలోనే అత్యంత మేలు జాతి పశువుల జాబితాలో ఒంగోలు జాతి ఎడ్లది మొదటి స్థానం. అత్యంత కండ పుష్టి, బలం, వినయ విధేయతలతో పనిని తక్కువ కాలంలో సులువుగా నేర్చుకునే గ్రహణశక్తి కలిగి, మనుషులతో ప్రేమగా మెలుగుతాయి. అరుదైన సందర్భాలలోనే ఆవేశానికి లోనవుతాయి. పందేలలో గెలుపొందే వాటిలో మూడు వంతులు పైగా ఒంగోలు జాతి జతలే ఉంటాయి. మన రాష్ట్రంలో నూరు శాతం నిఖార్సయిన ఒంగోలు జాతి పశువుల సంఖ్య చాలా తక్కువగా ఉంది. ఒకప్పుడు వేల సంఖ్యలో ఉన్న ఒంగోలు గిత్తలు నేడు క్రమక్రమంగా తగ్గిపోతున్నాయి.
ఈ జాతి పశువులు సుమారు 4వేల సంవత్సరాల క్రితం మధ్య ఆసియా ప్రాంతం నుంచి హర్యానా, మధ్యప్రదేశ్ రాష్ట్రాల ద్వారా మన రాష్ట్రానికి ఆర్యుల వెంట వచ్చినట్టు చరిత్ర చెబుతోంది. దేశ,విదేశాల్లో పేరుగాంచిన ఈ జాతి సంపదను కాపాడేందుకు ప్రకాశం జిల్లా చీమకుర్తి మండలంలోని రామతీర్థంలో 1990లో పశుక్షేత్రాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత 2001లో నాగులుప్పులపాడు మండలం చదలవాడకు దీన్ని మార్చారు. అక్కడి పశువుల సంరక్షణ కోసం చదలవాడ రఘునాథస్వామి ఆలయానికి చెందిన 200 ఎకరాల మాన్యం భూములను కేటాయించారు. అయితే, అధికారులు నిర్లక్ష్యం, అవినీతి కారణంగా మేత లేక మూగజీవాలు అల్లాడుతున్నాయి.
ఒంగోలు జాతిని అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం మంజూరు చేస్తున్న నిధులన్నీ నిర్వాహకులు దిగమింగుతుంటే పశుక్షేత్రంలోని 265 ఆవులు, దూడలు ఎండిన డొక్కలతో మౌనంగా రోదిస్తున్నాయి. కనీసం వాటికోసం ఏర్పాటు చేసిన చెరువులో నీరు కూడా నింపకపోవడంతో తాగేందుకు నీరులేక తీవ్రఇబ్బందులు పడుతున్నాయి. వాటి సంరక్షణకు సరిపడా వైద్యులు లేకపోవడంతో ఈ జాతి రోజురోజుకూ అంతరించిపోతుంది. ఓ వైపు ఈ జాతి సంపదను పొరుగు దేశాలు అభివృద్ధి చేస్తుంటే.. మన ప్రభుత్వాలు మాత్రం పట్టించుకోవడం లేదని ప్రజాసంఘాల నేతలు మండిపడుతున్నారు.
ప్రస్తుతం చదలవాడ పశుక్షేత్రంలో ప్రస్తుతం మేలు జాతి ఎడ్ల కంటే రోడ్ల వెంట తిరిగే పశువులు, వికలాంగ పశువులే అధికంగా దర్శనమిస్తున్నాయి. వాటికోసం లక్షల రూపాయలతో నిర్మించిన షెడ్లు నిరుపయోగంగా మారాయి. దీంతో అవి ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ దీనావస్థలో ఉన్నాయి. నిర్వాహకులు మాత్రం పశువులకు ఎలాంటి సౌకర్యాలు కల్పించకపోగా.. లెక్కలు మాత్రం లక్షల్లో చూపిస్తున్నారు. దీంతో ఒంగోలు జాతి సంపద పట్ల అధికారులు, పాలకులు వ్యవహరిస్తున్న తీరును రైతు సంఘాల నేతలు విమర్శిస్తున్నారు. ఒంగోలు గిత్తలను సంరక్షించడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయని మండిపడుతున్నారు. ఇప్పటికైనా పాలకులు స్పందించి అంతరించిపోతున్న ఒంగోలు జాతి పశుసంపదను కాపాడాలని ప్రకాశం జిల్లా వాసులు కోరుతున్నారు.