ప్రజా సమస్యల పరిష్కారమే అజెండాగా ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర ఏడాది పూర్తి చేసుకుంది. పాదయాత్ర సందర్భంగా లక్షలాది మందితో మమేకమైన జగన్ టీడీపీ ప్రభుత్వ తీరుపై తీవ్ర స్ధాయిలో విమర్శలు గుప్పించారు. ఇదే సమయంలో తమ పార్టీ అధికారంలోకి వస్తే చేపట్టబోయే నవరత్నాల గురించి విస్త్రతంగా ప్రచారం నిర్వహించారు. పాదయాత్ర సందర్భంగా విశాఖ ఎయిర్‌పోర్టులో జరిగిన దాడిలో గాయపడిన ఆయన ప్రస్తుతం కోలుకుంటున్నారు.
ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన ప్రజా జీవితంలో అరుదైన రికార్డును స్పష్టించారు. ప్రజా క్షేత్రంలో ఏడాది పాటు పాదయాత్ర చేసి చరిత్రను తిరగరాశారు. సరిగ్గా ఏడాది క్రితం ప్రజా సంకల్పయాత్ర చేపట్టిన జగన్ ప్రజల మధ్యే ఏడాది పూర్తి చేసుకున్నారు. 2017 నవంబర్ ఆరున తండ్రి సమాధి చెంతన ప్రార్ధనలు ఆశీర్వాదం తీసుకున్న జగన్ నాటి నుంచి అను నిత్యం ప్రజల మధ్యే ఉంటూ పాదయాత్ర కొనసాగిస్తున్నారు.
కోర్టు కేసులతో వారంలో ఒక రోజు యాత్రకు విరామం ఇస్తూ జగన్ పాదయాత్ర సాగించారు. ఇప్పటి వరకు 294 రోజులు యాత్ర సాగించిన జగన్ 3 వేల 211 కిలోమీటర్లు నడిచారు. 11 జిల్లాల్లో పాదయాత్ర పూర్తి చేసిన జగన్ ప్రస్తుతం విజయ నగరం జిల్లాలో యాత్ర కొనసాగిస్తున్నారు. ఇప్పటి వరకు 122 నియోజకవర్గాలు, 205 మండలాలు, 1739 గ్రామాలు, 47 మున్సిపాలిటీలు, 8 కార్పోరేషన్ల మీదుగా జగన్ ప్రజా సంకల్పయాత్ర సాగింది. ఈ సందర్భంగా జగన్ 42 ఆత్మీయ సమావేశాలు, 113 బహిరంగ సభలతో ప్రజలకు మరింత చేరువయ్యారు.
పాదయాత్ర సందర్భంగా టీడీపీ ప్రభుత్వంతో పాటు సీఎం చంద్రబాబు, ఆయన తనయుడు నారా లోకేష్‌లే లక్ష్యంగా ఆరోపణలు గుప్పించారు. ప్రభుత్వ అవినీతిని ప్రశ్నిస్తూనే ప్లీనరిలో ప్రకటించిన నవరత్నాలను జగన్ విస్త్రతంగా ప్రచారం చేశారు. గత ఎన్నికల్లో చేసిన పొరపాట్లకు తావు ఇవ్వకుండా నియోజకవర్గాల వారిగా సమస్యలను లేవనెత్తుతూ యాత్ర కొనసాగించారు.
జగన్ పాదయాత్రతో టీడీపీ నేతల అవినీతి జనంలోకి బాగా వెళ్లిందని వైసీపీ నేతలు చెబుతున్నారు. ఇదే సమయంలో తమ పార్టీ ప్రకటించిన నవరత్నాలు జనాన్ని ఆకట్టుకుంటున్నాయంటూ భరోసా వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇదే సమయంలో కాపుల రిజర్వేషన్, జనసేన అధినేత వపన్ కళ్యాణ్‌లపై వ్యక్తిగత విమర్శలు జగన్‌కు మైనస్‌గా మారాయి. యాత్ర ప్రారంభంలో వైసీపీ నుంచి వలసలు కొనసాగినా గుంటూరు, కృష్ణా జిల్లాల్లో ప్రవేశించే నాటికి టీడీపీకి చెందిన పలువురు సీనియర్ నేతలు వైసీపీ కేడర్‌లో కొత్త ఉత్సాహాన్ని నింపింది.
విజయ నగరం జిల్లాలో పాదయాత్ర సాగిస్తున్న జగన్ గత నెల 26న కోర్టుకు హాజరయ్యేందుకు వస్తుండగా విశాఖ ఎయిర్ పోర్టులో హత్యయత్నం జరిగింది. శ్రీనివాసరావు అనే వ్యక్తి కోడి కత్తితో జగన్‌పై దాడికి దిగారు. ఆసుపత్రిలో శస్త్రచికిత్స అనంతరం కోలుకుంటున్న జగన్ ఈ నెల 10 నుంచి పాదయాత్ర చేపట్టే అవకాశాలున్నాయి. ఈ ఏడాది డిసెంబర్ నాటికి పాదయాత్ర పూర్తి చేయాలని భావిస్తున్న జగన్ వచ్చే ఏడాది బస్సు యాత్రకు శ్రీకారం చుట్టనున్నారు. పాదయాత్ర చేయని నియోజకవర్గాల్లో బస్సు యాత్ర కొనసాగనుంది.