మలుపులు తిరుగుతున్న వైఎస్ జగన్‌పై దాడి కేసు...రిమాండ్ రిపోర్ట్‌లో సంచలన విషయాలు
ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్‌పై దాడి వెనక కుట్ర కోణం ఉందా ? హత్య చేసే ఉద్దేశంతోనే నిందితుడు శ్రీనివాస్ దాడి చేశాడా ? పథకం ప్రకారమే శ్రీనివాస్ రావు ప్రతి అడుగు పడిందా ? ఈ కేసులో పోలీసులు దాఖలు చేసిన రిమాండ్ రిపోర్ట్‌లో ఏముంది ? నిందితుడి అసలు టార్గెట్ ఏంటి ?
ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై జరిగిన దాడి కేసులో వాస్తవాలు ఒక్కోక్కటిగా వెలుగు చూస్తున్నాయి. జగన్‌కు సానుభూతి రావాలనే దాడి చేసినట్టు నిందితుడు శ్రీనివాసరావు చెప్పిన మాటల్లో వాస్తవం లేనట్టు పోలీసులు తేల్చారు. ఈ కేసు వ్యవహారంలో పోలీసులు దాఖలు చేసిన రిమాండ్ రిపోర్ట్‌లో పలు సంచలన విషయాలు వెల్లడయ్యాయి. హత్య చేసే లక్ష్యంతోనే దాడి చేసినట్టు గుర్తించారు. ఇందుకోసం 10 నెలల ముందు నుంచే ప్లాన్ చేసినట్టు దర్యాప్తులో గుర్తించారు. ఈఏడాది జనవరిలోనే కత్తి కొనుగోలు చేసి క్యాంటిన్‌లో దాచినట్టు తెలిపారు.
నిందితుడు శ్రీనివాస్ ఏడాదిలో 9 సెల్‌ఫోన్లు యూజ్ చేశారని ఇందులో నాలుగు స్వాధీనం చేసుకున్నట్టు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. ఏడాదిలో తొమ్మిది సెల్‌ఫోన్లు వాడటంపై దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. మొత్తం కాల్ డేటాను విశ్లేషిస్తున్నామంటూ తెలిపారు. దీంతో పాటు నిందితుడి ఓ ట్యాబ్‌ను కూడా స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. ఇదే సమయంలో నిందితుడికి విజయ, ఎస్‌బీఐ, ఆంధ్రా బ్యాంకుల్లో అకౌంట్లు ఉన్నట్టు గుర్తించారు. వీటి ద్వారా ఎలాంటి లావాదేవీలు జరిగాయానే దానిపై కూడా దర్యాప్తు చేస్తున్నట్టు విశాఖ పోలీసు కమిషనర్ మహేశ్ చంద్ర లడ్డా తెలిపారు.
నిందితుడు శ్రీనివాస్ నుంచి మొత్తం 9 వస్తువులను స్వాధీనం చేసుకున్నామని చెప్పిన లడ్డా ఇందులో నాలుగు సెల్‌ఫోన్లు, ఓ ట్యాబ్, దాడికి ఉపయోగించిన కత్తితో పాటు మరో ఆయుధం, రెండు సిమ్‌కార్డులు ఉన్నట్టు తెలిపారు. వీటిపై మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నట్టు ఆయన తెలిపారు. రిమాండ్ రిపోర్ట్ ఆధారంగా వైసీపీ నేతలు తమ ఆరోపణలకు పదును పెడుతున్నారు. సానుభూతి కోసం దాడి చేస్తే ఇంత పకడ్భందీగా ప్లాన్ చేస్తారా అంటూ ప్రశ్నిస్తున్నారు. రిమాండ్ రిపోర్టును నిందితుడికి మాత్రమే పరిమితం చేశారని నిందితుడి వెనక ఉన్న వారి గురించి ఎందుకు దర్యాప్తు చేయలేదని ప్రశ్నిస్తున్నారు.