వారసత్వ రాజకీయాలపై తెలుగు రాష్ట్రాల్లో హాట్ హాట్ చర్చ జరుగుతోంది. ముఖ్యమంత్రుల పిల్లలు ముఖ్యమంత్రులు కావడానికి ఇదేమైనా రాజరికమా అని జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ ప్రశ్నించారు.
నారా లోకేష్
నారాలోకేష్ గురించి చెప్పండన్న అభిమానుల వ్యాఖ్యలపై పవన్ కల్యాణ్ తనదైన శైలిలో సమాధానం చెబుతూ చంద్రబాబు గారు లాంటి నాన్నగారు నాకు లేరు. అలా ఉంటే నేను సమాధానం చెప్పే వాడినంటూ దాటవేశారు. మానాన్న హెడ్ కానిస్టేబుల్ ఆయన గురించి మాట్లాడదామన్నా లేరు. లోకేష్ నాన్న చీఫ్ మినిస్టర్. లోకేష్ కెపాసిటీ చూశారేమో నాకు తెలియదు అని ఏపీ మంత్రి లోకేశ్ పైనా కీలక వ్యాఖ్యలు చేశారు.
పవన్ కల్యాణ్ కు నారాలోకేష్ కౌంటర్
వారసత్వరాజకీయాలు ఎవరు ఆహ్వానించడంలేదని కౌంటర్ ఇచ్చారు లోకేష్. పలాన వ్యక్తి కూతురో అని అనుకుంటే ప్రజలు ఓట్లేసే పరిస్థితిలో లేరు.ప్రజాసమస్యల్ని ఎవరు పరిష్కరిస్తారో వారే రేపు నిలబడతారని చెప్పుకొచ్చారు. అయితే వారసులుగా అవకాశం వచ్చిన మాట వాస్తవమే అయినా సమర్థంగా పనిచేయకుంటే రాజకీయాల్లో నిలబడలేమన్నారు. డాక్టర్ పిల్లలు డాక్టర్లు అవ్వాలని, ఐఏఎస్ పిల్లలు ఐఏఎస్ అవ్వాలని కోరుకుంటారు. వారసత్వంగా మాకు ప్రజలకు సేవచేసే ఓ అవకాశం వచ్చింది. తలుపులు తెరుచుకుంటాయి. మేం నిలబెట్టుకోవాలిగా. ఆ ప్రయత్నంలోనే ఉన్నామని వెల్లడించారు.