కర్నూలు జిల్లా ఆత్మకూరు మండలం నల్లమల ఘాట్ రోడ్డులో ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో 5 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ఇనుము లోడుతో వెళ్తున్న ఓ భారీ ట్రక్కు కొండ చరియను ఢీ కొట్టింది. దీంతో అటు ఇటు వస్తున్న వాహనాలు వందల సంఖ్యలో నిలిచిపోయాయి. అరణ్యంలో చిక్కుబడినవారు ఆకలితో అలమటిస్తున్నారు. మరికొందరు 27 కిలోమీటర్ల దూరంలోని ఆత్మకూరుకు కాలినడకన ప్రయాణం ప్రారంభించారు.
నల్లమల ఘాట్ రోడ్డులో 20 కిలోమీటర్ల దగ్గర కర్నూలు నుంచి అమరావతి వెళ్తున్న భారీ లారీ ట్రక్కు మలుపు దగ్గర బ్రేక్ ఫెయిలైంది. ఎదురుగా ఉన్న కొండను ఢీ కొట్టింది. ఆ తర్వాత వాహనం మొరాయించి ముందుకు కదలలేదు. దీంతో ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. ఆత్మకూరు-దోర్నాల పెద్దపులుల అభయారణ్యం, రోళ్లపెంట ఘాట్ రోడ్డులో ఈ సంఘటన చోటు చేసుకుంది.
ఆత్మకూరు డీఎస్పీ మాధవరెడ్డి సిబ్బందితో కలిసి ట్రాఫిక్ క్లియర్ చేసేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. భారీ యంత్రాలతో లారీని తొలగించేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఈ ఘాట్ రోడ్డు 340సీ జాతీయ రహదారిగా మారినా అటవీశాఖ నిబంధనలతో రోడ్డు వెడల్పు పనులకు అనుమతులు లేవు. తాగేందుకు చుక్కనీరు లేక, ఆకలిదప్పులతో వృద్ధులు, చిన్నారులు 6 గంటలకు పైగా నానా అవస్థలు పడుతున్నారు. 25 కిలోమీటర్ల దూరంలోని బైర్లూటి అటవీ చెక్‌పోస్టుకు కాలినడకన చేరుకుంటున్నారు. తమ బాధలను ఆర్టీసీ అధికారులు పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.